శభాష్ దాదీ
అభిరుచి, ఆసక్తి ఉండాలే కానీ ఏదైనా సాధించవచ్చు. వయస్సు ఏమాత్రం అడ్డంకిగా మారదు. అందుకు ఉదాహరణే హర్యానాకు చెందిన భగవానీ దేవి భామ్మ. ఎన్నో అడ్డంకులను అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. లేటు వయసులో క్రీడల్లో ప్రతిభ కనబరుస్తూ పతకాల మీద పతకాలు సాధిస్తోంది. చిన్నప్పుడు స్నేహితులతో కలిసి కబడ్డీ ఆడటాన్ని ఇష్టపడేది. 12 ఏళ్లకే వివాహం చేసుకున్న ఆమె ఇద్దరు పిల్లలను, భర్తను కోల్పోవడంతో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది.
దాంతో ఒంటరి జీవితం గడుపాల్సి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత ఆమె మనువళ్లు అభిరుచిని గ్రహించి మళ్లీ క్రీడలు ఆడేలా చేశారు. ఆమె పెద్ద మనవడు వికాస్ ఒక షాట్ పుట్ బంతిని ఇంటికి తీసుకువచ్చాడు. 94 ఏళ్ల వయసులో తన ఇద్దరు మనవళ్లతో కలిసి ఆడటం మొదలుపెట్టింది. ఆ తర్వాత కొన్ని నెలలకే 2022లో ఢిల్లీ స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు సాధించింది. ఆ తర్వాత పోలాండ్‌లో జరిగిన 9వ ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇండోర్ చాంపియన్ షిప్‌లో మూడు బంగారు పతకాలు సాధించింది.
9వ ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇండోర్ చాంపియన్‌షిప్‌లో 60 మీటర్ల పరుగు, షాట్ పుట్, డిస్కస్ త్రోలో స్వర్ణాలు సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. తాజాగా 95 ఏళ్ల వయసులో మూడు స్వర్ణ పతకాలు కొల్లగొట్టి ఔరా అనిపించింది. ఇక భగవానీ దేవి పెద్ద మనువడు వికాస్ డాగర్ పారా అథ్లెట్‌గా రాణిస్తున్నాడు. ఇప్పటికే అథ్లెటిక్స్‌లో ఎన్నో పథకాలు సాధించిన వికాస్ డాగర్ ఖేల్ రత్నతోపాటు పలు అవార్డులను అందుకున్నాడు.
ఆమె శిక్షణ విషయానికొస్తే వారానికి రెండుసార్లు కఠినమైన శిక్షణ తీసుకుంటుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నడక కొనసాగిస్తుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడటమే తన విజయ రహస్యం అని అంటోంది ఈభామ్మ.




