22 April, 2026 | 1:39 AM

బీజేపీకి చిక్కని తమిళ‘నాడి’

22-04-2026 12:00 AM

ద్రవిడ రాష్ట్రం తమిళనాడులో పాగా వేయాలని బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. రకరకాల సమీకరణాలు, వ్యూహాలతో తమిళనాట విస్తరణకు కమలనాథులు రంగంలోకి దిగారు. ఆ రాష్ట్రంలో పట్టు సాధించేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని మాత్రం పట్టుకోలేకపో తున్నారు. హిందీ, హిందూత్వకు వ్యతిరేకంగా ప్రాంతీయ (ద్రవిడ) అస్తిత్వమే భూమికగా ఇక్కడ రాజకీయాలు సాగుతుండటమే అందుకు కారణం.

ప్రాంతీయ భావన, తమిళ భాష ఆత్మగౌరవానికి పెద్దపీట వేసే తమిళులు జాతీయ పార్టీల పట్ల ఆదరణ చూపే పరిస్థితులు కనిపించడం లేదు. ఇందుకు కమలనాథుల అంచనాలు తప్పుగా ఉండటమూ ఓ కారణం కావచ్చు. తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అన్నాడీఎంకేతో పొత్తులో ఉండి 27 స్థానాల్లో పోటీ చేస్తోంది. తెలంగాణలో చేసిన తప్పిదాలే ఆ పార్టీ తమిళనాడులోనూ చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను పదవి నుంచి తప్పించడంతో ప్రజలు సైతం కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయంగా చూశారని, అందుకే రేవంత్ నాయకత్వంలో హస్తం పార్టీ అధికారంలోకి రాగలిగిందని రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. తమిళనాడులో బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై పాదయాత్ర చేశారు. దాంతో జనంలో బీజేపీ పట్ల కొంత ఆదరణ పెరిగింది.

పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగే లీడర్‌గా తమిళనాడులో ప్రత్యామ్నాయ రాజకీయానికి తెరతీసే ప్రయత్నం చేశారు. ఇంతలో బీజేపీ జాతీయ నాయకత్వం ఆయనను తప్పించింది. దీంతో పార్టీపై ఎఫెక్ట్ ఉంటుందనే వాదనలున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఎన్నికల ముఖచిత్రం భిన్నంగా ఉన్నది. గత ఎన్నికల్లో 57 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ, ఈ సారి కేవలం 27 సెగ్మెంట్లలోనే పోటీ చేయడం వెనక ఆంతర్యమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అన్నామలై వంటి నాయకుడిని ఎన్నికల బరిలో నిలిపితే కలిగే మైలేజ్‌ను జాతీయ నాయకత్వం ఎందుకు గుర్తించలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్ననే. పైగా ఆయన పోటీ చేసిన సెగ్మెంట్‌ను పొత్తులో భాగంగా అన్నాడీఎంకేకు కేటాయించడం గమనార్హం. అన్నామలైను పక్కనపెట్టడం, నైనార్ నాగేంద్రన్‌కు పార్టీ అధ్యక్షుడిని చేయడం పట్ల కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో త్రిముఖ పోరులో డీఎంకే కూటమి, విజయ్ పార్టీని కాదని ప్రజలు ఎన్డీయే పక్షాన ఏ మేరకు మొగ్గుచూపుతారో చూడాలి.