ప్రజాస్వామ్య పరిరక్షణ పోరు
భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక తనిఖీ కార్యక్రమం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) దేశవ్యాప్తంగా, ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఏప్రిల్ 23, 29న రెండు విడతల్లో ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్‌లో సర్ ప్రభావం గణనీయంగా ఉండొచ్చన్న విశ్లేషణల నేపథ్యంలో ఇప్పుడు అందరి కళ్లు ఈ రాష్ట్రంపైనే ఉన్నాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ తొలిసారిగా తెరపైకి వచ్చిన ‘సర్’ కార్యక్రమం, ఆ రాష్ట్రంలో కంటే బెంగాల్‌లోనే ఎక్కువ చర్చనీయాంశంగా మారడం గమనార్హం. కేంద్రంలోని బీజేపీ అయాచిత లబ్ధి చేకూర్చేందుకు టీఎంసీ మద్దతుదారుల ఓట్లను భారీగా తొలగించారనే ఆరోపణలతో పశ్చిమ బెంగాల్‌లో ‘ఎన్నికల సంఘం వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్’ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఒకరిపై మరొకరి తీవ్రమైన ఆరోపణలతో ఎన్నికల కమిషన్, టీఎంసీ మధ్య ముందే పోరు మొదలైపోయిందని చెప్పవచ్చు.
మరీ ముఖ్యంగా అధికార టీఎంసీ ఈ ఎన్నికలను ప్రజాస్వామ్య పరిరక్షణ పోరుగా అభివర్ణిస్తుండటంతో ఎలక్షన్లు ఆసక్తికరంగా మారాయి. అయితే, సరైన కారణాలు చెప్పకుండా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 లక్షలకు పైగా ఓట్లను తొలగించారనే ఆరోపణలు వినిపిస్తుండటం ఆందోళనకరం. నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్, క్రికెటర్ మహమ్మద్ షమి, నటుడు, ఎంపీ దేవ్‌లకు ఎన్నికల సంఘం నోటీసులు జారీచేయడం ఇందుకు మరింత ఆజ్యం పోసింది. ఎయిర్‌ఫోర్స్‌లో 20 ఏళ్లకు పైగా సేవలందించి రిటైర్ అయిన అధికారి షమీమ్ అక్తర్ ఓటును తొలగించడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కాగా, వీటిపై ఆ తర్వాత ఎన్నికల అధికారులు వివరణ ఇచ్చుకో వాల్సి వచ్చింది.
మరోవైపు బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురీ పోటీచేస్తున్న బెర్హంపూర్ నియోజకవర్గాల్లో సుమారు 25 శాతం ఓట్లను తొలగించారనే ఆరోపణలు వస్తుండటం, బీజేపీ నేత సువేందు అధికారి బరిలో ఉన్న నందిగ్రామ్‌లో 3 శాతం ఓట్లను మాత్రమే తొలగించారనే వార్తలు వస్తుండటంతో ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొన్నది. ఓటుహక్కు కోల్పోయిన 35 లక్షల మంది వేసిన రివ్యూ పిటిషన్లు ఇంకా పెం డింగ్‌లోనే ఉండటంతో వారు ఓటు వేసే హక్కును కోల్పోవాల్సి వచ్చింది. తీవ్రమైన ఆరోపణల మధ్య జరుగుతున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అంతిమంగా ప్రజాస్వామ్యమే గెలవాలని ఆశిద్దాం.






