భూరక్షణే జన రక్షణ
నేడు అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవం
ప్రకృతి ప్రసాదించిన పర్యావరణాన్ని మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం అనేక రకాలుగా నాశనం చేస్తున్నాడు. ముఖ్యంగా మానవ జాతి మనుగడకు ఆధారమైన భూమిని అభివృద్ధి పేరుతో విధ్వంసం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే భూమి, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కలిగించడానికి ఏటా ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
‘మన శక్తి మన గ్రహం’ థీమ్‌తో ఈ ఏడాది ధరిత్ర దినోత్సవాన్ని జరుపుతున్నారు. భూ గ్రహాన్ని కాపాడేందుకు మనం చేసే కృషిని తెలిపే రోజు ఇది. మానవ తప్పిదాల కారణంగా ఇప్పటికే భూగ్రహం వినాశనం అంచున నిలిచి ఉన్నది. చెత్తాచెదారం వల్ల భూసారం దెబ్బతింటోంది. ఒక్క మన దేశంలోనే రోజూ 15 వేల టన్నుల కంటే ఎక్కువ చెత్త ఉత్పత్తి అవుతున్నట్లు అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు వందల ఏళ్లు భూమిలోనే ఉండటం వల్ల భూమి ఉత్పాదక శక్తి తగ్గుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాల మూలంగా పశువులు, పక్షులు చనిపోతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మానవ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. పెరుగుతున్న భూకాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. జనాభా పెరుగుదలను అరికట్టాలి.
భూమి ఉత్పాదకతను పెంచాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. చిత్తడి నేలలను విస్తరించాలి. సామాజిక వనాలను పెంచాలి. చిట్టడవులను సంరక్షించాలి. సహజ వనరుల సంరక్షణను ఒక ఉద్యమంగా కొనసాగించాలి. పంటల మార్పిడి చేసి నేల ఆరోగ్యాన్ని కాపాడాలి. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం పట్ల ప్రజల్లో అవగాహన కలిగించాలి. తద్వారా భూరక్షణే జన రక్షణ అన్న స్పహను సమాజంలో కలిగించాలి. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన కానుక భూమిని మనం రక్షిస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుందన్న విషయాన్ని మరువకూడదు.
నేదునూరి కనకయ్య, 9440245771






