calender_icon.png 10 February, 2026 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదు

10-02-2026 01:59:42 AM

  1. నిర్మల్‌లో సీఎం సూచనతో ఎంఐఎం ఎమ్మెల్యేలు ముస్లింలను రెచ్చగొట్టేలా మాటలు
  2. బీజేపీని ఓడించేందుకు మూడు పార్టీలు ఏకం 
  3. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రజలను మోసం చేశాయి 
  4. నిర్మల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

నిర్మల్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచన మేరకే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు ముస్లింలను రెచ్చగొట్టే విధంగా బహిరంగ సభలో మాట్లాడారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు మూడు పార్టీలు ఏకమయ్యాయయని ఆరోపించారు.

సోమవారం బీజేఎల్పీ నేత మహేశ్వరుడితో కలిసి నిర్మల్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో రాంచందర్‌రావు మాట్లా డుతూ.. ప్రస్తుత జరుగుతున్న ఎన్నికలు బీజేపీకి, రాష్ట్ర రక్షణకు ఎంతో కీలకమన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతున్నదన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలతో కుమ్ముకయ్యాయని ఆరోపించారు.

గతంలో నిర్మల్ వచ్చిన ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హిందువులపై కించపరిచే వ్యాఖ్యలు చేశారని, ఐదేళ్ల తర్వాత మళ్లీఎన్నికలు వచ్చా యని ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభు త్వం దేశంలో ధర్మరక్షణ శాంతిభద్ర పర్యవేక్షణ దేశ సమగ్రత సబ్‌కా వికాస్ నినాదంతో పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్, రెండున్నర ఏళ్లుగా పాలిస్తున్న కాంగ్రెస్ ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. రాష్ట్రంలో అనేక కుంభకోణాలకు రెండు పార్టీలు ప్రధాన కారణమన్నారు.

రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతుందని అందుకే ఆ మూ డు పార్టీలు చీకటి ఒప్పందాన్ని చేసుకొని పరస్పరం సహకరించుకుంటూనని ఆరోపించా రు. బీజేపీ అభ్యర్థులు తప్పకుండా విజ యం సాధించి నిర్మల్ జిల్లాలో మెజార్టీ స్థానాలను దక్కించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. నిర్మల్ గడ్డ బీజేపీకి అడ్డగా మారబోతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌వి అబద్ధపు ప్రచారాలు 

నిజామాబాద్ (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాంచందర్‌రావు మండిపడ్డారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య విబేధాలు సృష్టించి వివక్ష చూపిస్తోందని అన్నారు. ‘బీజేపీకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అస్సాం నుంచి అహ్మదాబాద్ వరకు దేశమంతా ఒక్కటే అయినప్పటికీని, ప్రజాదరణ కోల్పోతున్న కాంగ్రెస్ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతోందనీ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నిజామాబాద్ బల్దియాపై కాశాయ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే బీజేపీపై కాంగ్రెస్ విషప్రచారం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులన్నీ ప్రక్కతోవ పట్టించి, అభివృద్ధి జరగకుండా చేశార న్నారు. గడిచిన 12 ఏళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయో తమ వద్ద చిట్టా ఉన్నదని రామచందర్‌రావు పే ర్కొన్నారు.

‘అమృత్ పథకం ద్వారా నిజామాబాద్ అభివృద్ధి, రైల్వే స్టేషన్ల ఆధునీకర ణ, కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు అభివృద్ధి పథకాలన్నీ కేంద్రం కేటాయించిన నిధులతోనే జరుగుతున్నాయన్నారు. నిజామాబాద్ ము న్సిపల్ కార్పొరేషన్ తోపాటు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటమి భయం కాంగ్రెస్ నేతలను వెంటాడుతోందన్నారు. అందుకే వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సుమా రు 40కి పైగా నిరుద్యోగులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, పసుపు బోర్డు చైర్మన్ పరిర్లి గంగారెడ్డి పాల్గొన్నారు.