14 May, 2026 | 1:00 AM

అక్రమ నిర్మాణాల అడ్డా కంటోన్మెంట్ బోర్డ్

14-05-2026 12:18 AM
  1. బరితెగిస్తున్న బిల్డర్లు 
  2. మొద్దునిద్రలో అధికారులు 
  3. అక్రమార్కులకు నాయకుల అండ 
  4. కంటి తుడుపు చర్యలతో మమ
  5. అధికారుల తీరుపై అనుమానాలు

సికింద్రాబాద్, మే 13 (విజయక్రాంతి): పిల్లి గుడ్డిది అయితే ఎలుక తోకెత్తి చూపించినట్టు ఉంది. కంటోన్మెంట్ బోర్డ్ అధికారులను అంధకారులుగా మార్చి బిల్డర్లు బరితెగిస్తూ ఇష్టారీతిన రెచ్చిపోతున్నారు. వీరికి అధికారులు కూడా వత్తాసు పలుకుతుండడం గమనార్హం. కంటోన్మెంట్ ఆరో వార్డు ఎస్‌సిబి6 -ఆర్ 8-021, సిఖ్ విలేజ్ చందూలాల్ బౌలీ సర్వే నెంబర్ 10లో 1962లోనే కంటోన్మెంట్ బోర్డు ఓ లేఅవుట్‌కు అనుమతి ఇచ్చింది.

ఈ లే అవుట్‌లో యశోదా టాకీస్‌తో పాటు రోడ్డు వైపున పెద్ద సంఖ్యలో కమర్షియల్ నిర్మాణాలు వెలిశాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన భవన నిర్మాణ అనుమతులను సాకుగా తీసుకున్న ఏజీఆర్ ఎంటర్ ప్రైజెస్ భారీ అవినీతికి తెరలేపింది. చందూలాల్ బౌలీలోని వివాదాస్పద లే అవుట్ ప్లాట్ నెంబర్ 34, 36, 37 పార్ట్ పేరిట నూతనంగా భవన నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రతిపాదిత స్థలానికి రోడ్డు మార్గం లేకపోవడంతో ప్లాట్ నెంబర్ 37లో కొంత స్థలాన్ని రోడ్డుగా చూపించారు.

ప్లాట్ నెంబర్ 34లో అక్రమ నిర్మాణం కొనసాగుతుండగానే ఖాలీ ప్లాటుగా చూపి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిర్మాణదారులు అధికారులను మెప్పించడంతో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు కూడా ఇచ్చేశారు. దీంతో సదరు వ్యక్తులు నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపట్టారు. రెండు ప్లాట్ల మధ్యన ఉండాల్సిన సర్వీసు లైన్‌ను కలిపేసుకున్నారు. సెట్‌బ్యాక్ లేకుండా, అనుమతి ఇచ్చిన దానికంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టారు.

దీనిపై ఫిర్యాదులు రావడంతో ఎట్టకేలకు బోర్డు అధికారులు సెక్షన్ 239 కింద నోటీసులు జారీ చేశారు. అక్రమ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలంటూ సెక్షన్ 248 కింద మరో నోటీసు ఇచ్చారు. అనుమతికి మించి చేపట్టిన నిర్మాణ వైశాల్యం 600 గజాలు దాటిపోయింది. దీంతో 15 ఫీట్ల సెట్‌బ్యాక్ లేదంటూ బోర్డు అధికారులు నోటీసు ఇచ్చారు.

ఇవేమీ పట్టించుకోని అక్రమార్కులు యధేచ్ఛగా నిర్మాణాన్ని కొనసాగిస్తూ వచ్చారు. దీంతో బోర్డు అధికారులు సెక్షన్ 320 కింద నోటీసు జారీ చేసి, అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు. అయినా సదరు అక్రమ నిర్మాణం ఆగలేదు సరికదా మరింత వేగం పుంజుకోవడం విశేషం. గతంలోనే ఎమ్మెల్యే కూడా బోర్డు అధికారులను నిలదీశారు. 

అధికారులపై స్థానికుల మండిపాటు.. 

ఆరో వార్డు ఎస్‌సిబి 6 -ఆర్1-013 కార్ఖానాలో సర్వే నెంబర్ 59లో 18 ఏళ్ల క్రితం చేపట్టిన అక్రమ నిర్మాణం క్రమబద్ధీకరణ అంశం బోర్డు అధికారుల అవినీతి మాయాజాలానికి మరో ఉదాహరణ. ఈ స్థలంలో 2008లో మారుతి కన్‌స్ట్రక్షన్ భవన నిర్మాణ అనుమతి తీసుకుంది. అనుమతికి విరుద్ధంగా నిర్మాణం చేపట్టడంతో బోర్డు అధికారులు ది కంటోన్మెంట్ యాక్ట్ 2006 ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాలు చేస్తూ మారుతి కన్‌స్ట్రక్షన్ పుణేలోని సదరన్ కమాండ్‌లో సెక్షన్ 340 ప్రకారం అప్పీల్‌కు దరఖాస్తు చేసింది.

ఈ అప్పీలుపై విచారణ ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. ఇదిలా ఉండగానే మారుతి యాజమాన్యం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇందుకు సంబంధించిన సూట్ 2018లో డిస్మిస్ అయింది. ఈ క్రమంలోనే సదరు అక్రమ నిర్మాణాన్ని వీబీఆర్ డెవలపర్స్ అనే సంస్థకు విక్రయించింది. నూతన నిర్మాణ సంస్థ బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే అదనపు నిర్మాణాలు చేపట్టింది. బోర్డు అధికారులు నోటీసులు జారీ చేయగా, క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఈ దరఖాస్తునకు బోర్డు అనుమతి ఇవ్వడం వివాస్పదంగా మారింది. ఒక సంస్థకు ఇచ్చిన అనుమతి, అక్రమ నిర్మాణ నోటీసులపై అప్పీల్ పెండింగ్‌లో ఉండగానే విక్రయం జరగడం గమనార్హం. కొత్త సంస్థ సైతం చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించకుండానే క్రమబద్ధీకరణ దరఖాస్తునకు ఆమోదం తెలుపడం బోర్డు అధికారుల అత్యుత్సాహానికి నిదర్శనం. పైగా అదనపు నిర్మాణాన్ని తొలగించుకుంటే నిర్మాణాన్ని క్రమబద్దీ కరిస్తామంటూ ఏకంగా బోర్డు తీర్మాణం మరీ విడ్డూరం.

ఇంత బాహాటంగా నిబంధనలు ఉల్లంఘించడంపై ఒక బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సహా పలువురు స్థానికులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినా బోర్డు అధికారులు పట్టించుకోవం లేదు. విచిత్రమేంటంటే ఏజీఆర్ కన్‌స్ట్రక్షన్, వీబీఆర్ డెవలపర్స్ యాజమాన్య ప్రతినిధులు ఒక్కరే కావడం. వీరికి బోర్డు అధికారుల సహకారంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.