46 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు

26-04-2024 12:42:53 AM

l రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసింది కాంగ్రెస్సే

l కాంగ్రెస్ గ్యారెంటీలు అమలు కాలేదు.. మోదీ గ్యారెంటీలే అమలు

l కాంగ్రెస్ చార్జిషీట్‌పై బీజేపీ నేత ఎన్.రాంచందర్‌రావు ఆగ్రహం

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): తెలంగాణకు బీజేపీ చేసిన ద్రోహం పేరిట సీఎం రేవంత్ రెడ్డి ఛార్జిషీట్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంపై  మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత ఎన్.రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్జిషీట్ విడుదల చేయాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీపైనే విడుదల చేయాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీది ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం అని సీఎం రేవంత్ అంటున్నారని, ఆర్‌ఎస్‌ఎస్ దేశభక్తి ఉన్న సంస్థ అని, తాము ఆ విషయాన్ని గర్వంగా చెప్పుకుంటామన్నారు. కాంగ్రెస్‌ది పీఎఫ్‌ఐ భావజాలమా..? లేక ఐఎస్‌ఐ భావజాలమా.. అని ప్రశ్నించారు.

బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగం మారుస్తామని కాంగ్రెస్ అంటోందని, కాంగ్రెస్‌కే ఆ అలవాటు ఉందని, 46 సార్లు రాజ్యాంగాన్ని సవరించారని గుర్తు చేశారు. తమకు రాజ్యాంగం మీద ఎంతో నమ్మకం ఉందని తెలిపారు. దేశంలో మోదీ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని.. కానీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి 6 గ్యారెంటీలు, హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కాళేశ్వరం విషయంలో బీఆర్‌ఎస్‌తో రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.