తెలంగాణ అంటేనే తిరుగుబాటు

25-04-2024 02:43:37 AM

ఇంటర్వ్యూ

మూడు వందల సంవత్సరాల బ్రిటీషు సామ్రాజ్యవాదంపై, రెండు వందల సంవత్సరాల ఫ్యూడల్ నిరంకుశ నిజాం రాచరికంపై, ఆరు దశాబ్దాల సీమాంధ్రుల పెత్తనంపై తెలంగాణ ప్రజల తిరుగుబాటును కండ్లకు కట్టినట్లుగా తన పుస్తకాల్లో లిఖించిన వ్యక్తి పరవస్తు లోకేశ్వర్. లోకేశ్వర్ పూర్వికులు హైదరాబాద్ స్టేట్‌లోని బీదర్ జిల్లా బల్కీ తాలూకా దేబ్కా గ్రామంలో నివసించేవారు. ఆ ప్రాంతంలో వచ్చిన డొక్కల కరువు కారణంగా వాళ్ల తండ్రి పండరీనాథ్ కుటుంబంతో సహా వరంగల్ వచ్చి అక్కడ స్థిరపడినారు. వరంగల్  రైల్వేస్టేషన్‌కు సమీపంలోని గోవిందరాజుల బస్తీలో పుట్టి పెరిగిన లోకేశ్వర్ నిరాడంబరుడు, సౌమ్యుడు. ముఖ్యంగా నిఖార్సయిన తెలంగాణ వాది. తెలంగాణ అంటేనే ఒక తిరుగుబాటు అని తన రచనల ద్వారా చాటి చెప్పిన తెలంగాణ చరిత్రకారుడు. 1969 ఉద్యమ సమయంలో 19 యేండ్ల యువకుడిగా, నిజాం కాలేజ్ విద్యార్ధిగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న లోకేశ్వర్.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల చరిత్రను, ముల్కీ ఉద్యమాల నేపథ్యం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రత్యేక తెలంగాణ అనివార్యత, తెలంగాణ ప్రజల తిరుగుబాటు చరిత్రను ‘విజయక్రాంతి’తో పంచుకున్నారు. అవి ఆయన మాటల్లో....

తెలంగాణ ప్రజల హక్కులు, తెలంగాణ ఉద్యమాలు, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షలు ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినవి కావు. ముల్కీ ఉద్యమాల కొనసాగింపే ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలకు స్ఫూర్తిగా భావించాలి. 1294 కాలంలో ఖిల్జీ, తుగ్లక్ సైన్యాలతో వచ్చి దక్కన్ (హైదరాబాద్ స్టేట్)లో స్థిరపడ్డారు. వీళ్లను దక్కనీలు (స్థానికులు) అనేవారు. అలాగే బహమనీ సుల్తానుల పరిపాలన కాలంలో ఇరాక్, ఇరాన్, టర్కీ, అరేబియా దేశాల నుంచి కూడా చాలా మంది వలస వచ్చి దక్కన్ ప్రాంతంలో స్థిరపడ్డారు. వీళ్లను అఫాకీలు (స్థానికేతరులు) అనేవారు. ఈ క్రమంలోనే బహమనీ రాజ్య పరిపాలనలో దక్కనీలను ముల్కీలుగా, అఫాకీలను గైర్ ముల్కీలుగా వ్యవహరించేవారు. అఫాకీలు వర్తక వాణిజ్య రంగాలలో చేరి ఆర్థికంగా సిరిమంతులై ప్రభుత్వంలో, సైన్యం లోని కీలక స్థానాలను ఆక్రమించగా, దక్కనీలు మాత్రం అన్ని రంగాలలో ద్వితీయశ్రేణి ఉద్యోగాల్లో ఉన్నారు. దీంతో దక్కనీలకు, అఫాకీలకు ఆర్థిక, సామాజిక, మతపరమైన అంతరాలు పెరిగి తారాస్థాయికి చేరాయి. అహ్మద్‌షాల పరిపాలనలో అఫాకీలకు పెద్దపీట వేస్తూ నాటి ప్రధాని మహ్మద్ గవాన్ అమలు చేసిన సంస్కరణల కారణంగా స్థానికులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ముల్కీ, గైర్ ముల్కీ అంతర్గత కలహా లు తీవ్రరూపం దాల్చాయి. మహ్మాద్ గవాన్ అఫాకీ నుంచి వచ్చిన వాడే కావడంతో అఫాకీలనే ప్రధాన పోస్టులలో తీసుకున్నాడు. దీం తో ముల్కీ ఉద్యమం బాహమనీ రాజ్యంలో మొదలై ముల్కీలందరూ ఏకమై అప్పటి ప్రధాని మహ్మాద్ గవాన్‌ను హత్య చేశారు. 

ముల్కీ ఫర్మానా జారీ...

అనంతరం ఐదవ నిజాం, ఆరవ నిజాం కాలంలోనే ఇతర రాష్ట్రాలలో నుంచి వలసలు పెరగడం, బ్రిటీషు పాలనలో ఉన్న అనుభవం కారణంగా ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం ఉన్న ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల వారికి ఎక్కవ అవకాశాలు కల్పించడంతో ఇక్కడి ప్రజలకు ఉద్యోగాలలో తీవ్ర నష్టం జరిగింది. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే వాళ్లు నైజం ప్రభుత్వ దర్బార్‌లో, సంస్థానంలో రెవెన్యూ, పోలీసు, డిపార్ట్‌మెంట్‌లో తిష్ట వేశారు. నార్త్ ఇండియన్స్, లక్నో, లాహోర్, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్లలో ఎక్కవ ముస్లీంలే కావడం.. యదా రాజా తదా ప్రజా అన్నట్లు..గా హైదరాబాదీలపై క్రమంగా పెత్తనం మొదలైంది. ఇక్కడి భాషను, ఆచారాలను, సంస్కృతిని అపహాస్యం చేసేవాళ్లు. మీది ఇక్కడి దక్కనీ ఉర్దూ. మాది ఫసీ (శుభ్రమైన/ఫ్యూర్) ఉర్దూ అంటూ హేళన చేసేవాళ్లు. ఆ సమయంలో తేరుకున్న స్థానిక దక్కనీలు అప్నే లోగ్.. ఔర్ గైర్ (పరాయివాళ్లు) లోగ్ అన్నట్లుగా విడిపోయారు. స్థానికేతలరులకు ప్రాధాన్యత ఇవ్వడంపై నిరసనలు, ఉద్యమాలు షురూ అవుతున్నాయి. దీంతో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1919లో ముల్కీ నిబంధనలతో ఒక ఫర్మానా జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ముల్కీలనే (ముల్క్ అనే ఉర్దూ పదం నుంచి ముల్కీ అనే పదం వచ్చింది. ముల్క్ అంటే.. స్వదేశం. స్వదేశీయులైన స్థానికులను ముల్కీ అనేవాళ్లు) నియమించాలి. అలాగే వరుసగా 15 సంవత్సరాలుగా హైదరాబాద్ స్టేట్‌లో నివాసం ఉంటూ తిరిగి వెనక్కి వెళ్లే ఆలోచన లేని వాళ్లు కూడా ముల్కీలే అని ఆ ఫర్మానాలో పేర్కొన్నారు. 

1930లో మళ్లీ ముల్కీ ఫర్మానా జారీ...

అయితే 1930లో పంజాబ్ ఖాన్ సాహెబ్‌లను నేరుగా ఉద్యోగాల్లో తీసుకోవడంతో కుమారి పద్మజా నాయుడు, డాక్టర్ సతీఫ్ సయీద్, బూర్గుల రామకృష్ణ రావు, మందుమూల నర్సింగ్ రావు, మీర్ అక్బర్ అలీ ఖాన్ తదితరుల ఆధ్వర్యంలో స్థానికులకే ఉద్యోగ, ఉపాధి, విద్య అవకాశాలు కల్పించాలని ముల్కీ ఉద్యమం షురూ అయ్యింది. విషయం తెలిసిన నిజాం 1930లో హైదరాబాద్ రాష్ట్రంలో సమర్థవంతమైన, విద్యావం తులైన ముల్కీలకే ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇవ్వాలని, స్థానికులకే విద్యా, ఉద్యోగాలలో, ఉపాధి అవకాశాలు కల్పించాలని రెండవ ఫర్మానా జారీ చేశారు. దీంతో ముల్కీలు నిజాంకు కృతజ్ఞతలు తెలిపారు. ముల్కీ ఉద్యమం సాధించిన విజయోత్సాహాంతో 1934లో నిజాం ప్రజల సంఘం (ది నిజాం సబ్జెక్టు లీగ్)ను స్థాపించారు. దీనినే ఉర్దూలో ‘జమీయత్ రిఫాయామే నిజాం’ అని పిలిచేవారు. ఈ సంఘం ‘హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్’ అనే సంచనలనమైన స్లోగన్ ఇచ్చింది. చాలా మంది మేధావులు ఈ సంఘంలో అత్యంత చురుకుగా పని చేశారు. కానీ మజ్లిస్ ఆవిర్భావంతో ఆ సంఘం నిర్వీర్యమైంది. ఆ తరవాత నిజాం 1937లో నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మించారు. నిజాం సాగర్‌ను నిర్మించగానే.. ఎక్కడెక్కడి నుంచో పెద్ద ఎత్తున రైతులు నిజాం సాగర్ పరివాహాక ప్రాంతాల్లో వలసవాదులుగా రావడం, ఇక్కడే తిష్ట వేయడం జరిగింది. 

గైర్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం...

కమ్యునిస్టుల ఆధ్వర్యంలో 1946లో తెలంగాణ సాయుధ రైతాంగం పోరాటం మొదలైంది. కమ్యునిస్టు ఉద్యమం ఉధృతంగా జరుగుతుడంగా తలెత్తిన విభేదాలతో కమ్యునిస్టు పార్టీ 1951లో  రెండు పార్టీలుగా చీలింది. కమ్యునిస్టు ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న సందర్భంలోనే భారత పోలీసు యాక్షన్ మొదలైంది. 1948 సెప్టెంబర్ 13వ తేదీన భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానంపై పోలీసు చర్యను ప్రారంభించింది. ఆపరేషన్ పోలో పేరుతో ఐదు రోజుల మిలటరీ చర్య అనంతరం సెప్టెంబర్ 17 హైదరాబాద్ సైన్యం భారత సైన్యానికి లొంగిపోవడంతో నైజాం రాచరికం అంతమై మిలటరి గవర్నర్‌గా 1949 వరకు జే.ఎస్.చౌదరి కొనసాగారు. అనంతరం 1950లో పౌర ప్రభుత్వం ఏర్పడి సివిల్ అధికారి అయిన వెల్లోడి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అనంతరం 1952లో జరిగిన ఎన్నికలలో బూర్గుల రామకృష్ణ రావు నూతన ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. అయితే 1948 మధ్యకాలంలో కేంద్రం ఆధీనంలోని మిలటరీ ప్రభుత్వ పాలనలో ఉండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వలసలు నిరాటంకంగా కొనసాగాయి. తెలంగాణలో ఇంగ్లీషు విద్యాభ్యాసం లేదనే సాకుతో ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులు ప్రభుత్వంలో తిష్ట వేయడంతో అప్పుడు ఉన్న మొత్తం 8వేల ఉద్యోగాలలో 80శాతం స్థానికేతరులే. ఈ క్రమంలోనే నైజాం ప్రభుత్వం లోని లాయక్ అలీ మంత్రివర్గంలో మంత్రి గా, 1952లో ఎమ్మెల్యేగా ఉన్న రామాచారి ఆధ్వర్యంలో హైదరాబాద్ హితరక్షణ సమితిని స్థాపించి గైర్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం చేపట్టారు. నాటి బూర్గుల రామకృష్ణ రావు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న కొండా వెంకట రంగారెడ్డి, అతని అల్లుడు మర్రి చెన్నారెడ్డి పరోక్షంగా గైర్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమానికి మద్దతునిచ్చారు. ఆ సమయంలో జరిగిన కాల్పులలో సుమారు 16 మంది అమరులయ్యారని జస్టిస్ నరోత్తం రెడ్డి జ్యుడీషియల్ విచారణ చేసి ప్రకటించారు. 

విలీనాన్ని వ్యతిరేఖించిన నాయకులు...

వాస్తవానికి 1956లో తెలంగాణ ఏపీలో విలీనమైన పరిస్థితులలో కొంత మంది కాంగ్రెస్ నాయకులు ఆంధ్రాలో తెలంగాణను కలుపొద్దు, విలీనం చేయవద్దు అని, రెండు రాష్ట్రాల మధ్య తేడాలున్నాయని వ్యతిరేఖించారు. పులితో మేక దోస్తాన్ వద్దన్నారు. ముఖ్యంగా డిప్యూటీ ప్రధాన మంత్రి కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డికి వ్యతిరేఖించారు. కరీంనగర్ వాసి చొక్కారావు లాంటి వారు మా తెలంగాణను ఏపీలో కలుపొద్దు అని స్పష్టంగా చెప్పారు. ఆ సమయంలోనే పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. రక్షణలు ఇస్తాము అని ప్రకటించడంతో పాటు పదవుల ఆశ కూడా కల్పించడంతో రంగారెడ్డి, చెన్నారెడ్డి తదితరులు వెనక్కీ తగ్గారు. 



 బూడిద సుధాకర్