బీఆర్‌ఎస్‌తోనే విద్యుత్తు రంగానికి నష్టం

26-04-2024 12:44:10 AM

l గతంలో యూనిట్ రూ.20కు కొన్నారు

l మేము రూ.5.34కే కొంటున్నాం

l కేసీఆర్ ప్రభుత్వం అసమర్థత, నిర్లక్ష్యంతోనే అప్పులు పెరిగాయి

l డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపణలు

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): రాష్ట్రంలో పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో విద్యుత్ రంగం కోలుకులేని నష్టాలకు  గురైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. వారి అసమర్థత, నిర్లక్ష్యంతో అప్పుల ఊబిలోకి నెట్టారని తెలిపారు. విద్యుత్ రంగంపై మాజీ సీఎం కేసీఆర్ అవాస్తవ ప్రకటనలు చేశారని, పార్లమెంటు ఎన్నికల ముందు ప్రజలను తప్పదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో యూనిట్ రూ.20 చొప్పున కొనుగోలు చేశారని, తాము అధికారంలోకి వచ్చాక రూ.5.34కే కొంటున్నామని భట్టి తెలిపారు. ఎన్‌టీపీసీ రూ.15కు సరఫరా చేస్తామంటే తమ ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు. 2014 చట్టం ప్రకారం యూనిట్ రూ.5.60 చొప్పున సగటు ధర నిర్ణయించి 1,600 మెగావాట్ల విద్యుత్‌ను తెలంగాణ డిస్కమ్‌లకు సరఫరా చేసిందన్నారు.

ప్రభుత్వం రూ.13 కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తుందన్న ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా అధిగమించి క్షణం కూడా కరెంటు పోకుండా చర్యలు తీసుకుంటామని, రాబోయే 30 ఏళ్ల వరకు విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని సాధించేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతామన్నారు. దీర్ఘకాలిక అవసరాల కోసం ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేశామని మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన మాటల్లో వాస్తవం లేదని, 2017 నుంచి 1,000 మెగావాట్ల  విద్యుత్ సరఫరాకు డిసెంబర్ 2014లో ఒప్పందం చేసుకున్నారని.. కానీ తెలంగాణ డిస్కమ్‌లకు 300 నుంచి 400 మెగావాట్ల కన్నా ఎక్కువ సరఫరా చేయలేదన్నారు. ఏప్రిల్ 2022 నుంచి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేశారని, ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న ఒప్పందం అమలులో ఆనాటి ప్రభుత్వం విఫలమైందన్నారు.

డిసెంబర్ 2023 నుంచి రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంత అత్యధిక విద్యుత్ సరఫరాను చేశామని, తెలంగాణ డిస్కమ్‌లు రాష్ట్రంలో అత్యధికంగా 15,623 మెగావాట్లు 308.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్‌ను సాధించినట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లోనూ రికార్డ్ స్థాయిలో 4,093 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌ను తట్టుకొని నిలబడ్డామని, డిసెంబర్ 23 నుంచి రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధించిన సందర్భం లేదన్నారు. 2012లో గ్రిడ్ కూప్పకూలిన తరువాత  హైదరాబాద్ పవర్ ఐలాండ్ పథకం చేపట్టామని, రాష్ట్రం ఏర్పడక ముందే కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ పవర్ లాండ్‌గా రూపుదిద్దుకుందన్నారు. మేము అధికారం చేపట్టిన మూడు నెలల్లో 24 గంటల కరెంటు సరఫరా చేశామని, విద్యుత్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేసీఆర్ ఆరోపించడం తగదన్నారు. వాస్తవాలు చెరిపేస్తే చెరిగేవి కావని, విద్యుత్ రంగంపై చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు.