calender_icon.png 1 November, 2024 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాదంగా మారిన బాలుడి మృతి

19-04-2024 01:47:04 AM

పోస్టుమార్టం కోసం మృతదేహం వెలికితీత

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్18 (విజయక్రాంతి) : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం పాసిగామలో మూడేళ్ల క్రితం మరణించిన బాలుడి మృతదేహాన్ని  పోలీసులు గురువారం వెలికితీయడం చర్చనీయాంశంగా మారింది. మృతుడి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెబ్బెన మండలం లోని నంబలా గ్రామానికి చెందిన మల్లీశ్వరి, శ్రీనివాస్ దంపతుల పెద్ద కుమారుడు రిషి(11)కి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో పాసిగాంలోని భీమ్‌రావ్ బాబా ఆశ్రమం లో వైద్యం కోసం ఉంచారు. బాబా పూజలు నిర్వహిస్తూ, నూనెతో మర్ధన చేస్తూ బాలుడికి వైద్యం జరిపేవాడు. కొంతకాలానికి తన కుమారుడిని చూపించమని బాలుడి తల్లి బాబాను అడగగా చూపించకుండా మాయమాటలు చెప్పేవాడు. ఈ క్రమంలోనే బాలు డి తల్లిని లోబర్చుకోవాలన్న ఆలోచనతో ఆమెకు ఫోన్ చేసి వేధింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా బాలుడిని చిత్రహింసలకు గురి చేసేవాడు.

ఈ విషయాన్ని మల్లీశ్వరి తన భర్త శ్రీనివాస్‌కు చెప్పినప్పటికీ వినకుండా కుమారుడిని అక్కడే ఉంచి వైద్యం అందించాడు. ఈ క్రమంలోనే బాలుడి ఆరో గ్యం క్షీణించి మృతిచెందాడు. అయితే ఈ విషయాన్ని భీమ్‌రావు బాబా బాలుడి తం డ్రికి తెలియజేశాడు. విషయం బయటకు పొక్కితే తన ఆశ్రమానికి ఎవరూ రారనే ఉద్ధేశంతో మృతదేహాన్ని ఆశ్రమం వెనుక పాతిపెట్టాడు. ఆ తర్వాత బాలుడి తల్లి ఎన్నిసార్లు తన కుమారుడిని చూపించమన్నా చూపించేవాడు కాదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని పాతపెట్టినట్లుగా బాబా నేరం ఒప్పుకున్నాడు. తహసీల్దార్, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించగా అస్థిపంజరం బయటపడింది. పోస్ట్ మార్టం చేయించి బాబాతో పాటు బాలుడి తండ్రిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరచనున్నట్లు వెల్లడించారు. డీఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.