రాజాధిరాజా.. రఘువంశ తేజా!

19-04-2024 01:44:45 AM

l భద్రాద్రిలో అట్టహాసంగా రామయ్య మహాపట్టాభిషేకం

l ముఖ్యఅతిథిగా విచ్చేసి పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్ రాధాక్రిష్ణన్ 

ఖమ్మం , ఏప్రిల్ 18 (విజయక్రాంతి): శ్రీరామనవమి సందర్భంగా రామయ్య బుధవారం సీతమ్మను పరిణమయమాడి గురువారం కిరీటం, ఛత్రం, ఖడ్గం, రాజదండం, గధాధారుడై పట్టాభిషిక్తుడైయ్యాడు. ఈ అపురూప ఘట్టానికి భద్రాచలంలోని మిథిలా ప్రాంగణం వేదికైంది. రఘువంశ పాలనాధీశుడిగా రామయ్య ఠీవిని చూసి భక్తజనం పులకించారు. తొలుత అర్చకులు పవిత్ర గోదావరి నుంచి ప్రధాన ఆలయంలో రామయ్య పాదాలకు స్నపనం చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళవాద్యాల నడుమ రామయ్యను మిథిలా ప్రాంగణానికి తీసుకొచ్చారు. పవిత్ర జలాలతో ఆభరణాలు, ఆయుధాలతో పాటు స్థల శుద్ధి చేశారు.

పట్టాభిషేక మహోత్సవానికి విఘ్నం రాకుండా విశ్వక్సేన పూజ చేశారు. ముందుగా స్వామివారికి బంగారు పాదుకలు తొడిగారు. అనంతరం విశ్వక్సేనుడు అధిపతి అయి రాజముద్రికను సమర్పించారు. అనంతరం కుంభ హారతి, నక్షత్ర హారతులు ఇచ్చి పట్టాభిషేక ఘట్టాన్ని ముగించారు. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు గవర్నర్ రాధాక్రిష్ణన్ హాజరయ్యారు. స్వామివారి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయనకు హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి హనుమంతరావు, కలెక్టర్ ప్రియాంక ఆల స్వాగతించారు. ఆలయంలో ఆలయ ఈవో రమాదేవి, ప్రధానార్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఆహ్వానించారు. పట్టాభిషేక వేడుకను వీక్షించేందుకు వేలాది మంది భక్తులు భద్రాద్రికి విచ్చేశారు. ప్రభుత్వ యంత్రాంగం వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశారు.

వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఎస్పీ రోహిత్‌రాజ్ ఆధ్వర్యంలో భద్రాచలం ఏఎస్పీ పరితోశ్ పంకజ్  పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీతారాముల కల్యాణ వేడుక, శ్రీరాముని మహాపట్టాభిషేకాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వ అధికారులు, ఆలయ అర్చకులు, సిబ్బందితో పాటు పోలీసులకు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ ప్రియాంక ఆల అభినందనలు తెలిపారు. వేడుకలకు మంచి కవరేజీ ఇచ్చిన విలేకర్లకు కృతజ్ఞతలు తెలిపారు.