17-02-2026 12:00:00 AM
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పు మా ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం
కాంగ్రెస్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోకుండా ప్రజలు అభివృద్ధి వైపే నిలిచారు
మతం పేరుతో లబ్ధిపొందాలనుకునే పార్టీలకు తెలంగాణలో తావులేదు
నిజామాబాద్ మేయర్ పీఠంపై సామాన్య కార్యకర్తను కూర్చోబెట్టాం
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నిజామాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): కాంగ్రెస్ రెండేళ్ల ప్రజాపాలనకు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ ఎన్నికల ఇన్‌చార్జి అయిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి నిజామాబాద్ మేయర్ పీఠంపై నెలకొన్న పరిస్థితులను సమీక్షించేందుకు సోమవారం నిజామాబాద్‌కు ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకున్నారు. మేయర్ పీఠం దక్కించుకున్న అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ పథకం, వరికి బోనస్ తదితర పథకాలకు ఆకర్షితులైన ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని చెప్పారు. ఇది ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఇచ్చిన రెఫరెండం అని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి గద్వాల వరకు, పరిగి నుంచి కోదాడ వరకు రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కాంగ్రెస్ గెలుచుకున్నదని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు మాత్రం అభివృద్ధి వైపే నిలిచారని పేర్కొన్నారు.
పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నామని వెల్లడించారు. సమస్యలు ప్రభుత్వ దృష్టికి వచ్చిన 24 గంటల్లోనే పరిష్కరిస్తున్నామని చెప్పారు. గత పదేళ్ల పాలకులకు, తమకు ఉన్న తేడా ఇదేనని పేర్కొన్నారు. మతం పేరుతో సమాజాన్ని వర్గాలుగా విడగొట్టి, రాజకీయ లబ్ధి పొందాలని చూసే పార్టీలకు తెలంగాణలో తావులేదని ఉత్తమ్ హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల్లో పారిన పప్పులు ఇక్కడ ఉడకవని, ప్రజలు తమ తీర్పు ద్వారా స్పష్టం చేశారని అన్నారు.
మేయర్‌గా సామాన్య కార్యకర్త
కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఒక సామాన్య కార్యకర్తను నిజామాబాద్ మేయర్ పీఠంపై కూర్చోబెట్టామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది అన్నారు. నిజామాబాద్ మేయర్ పీఠానికై ఎన్నికైన ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కూరగాయల ఉమారాణిని ఆయన అభినందించారు. 2005లో నిజామాబాద్ ఇన్‌చార్జిగా ఉన్నప్పుడు మేయర్ పీఠాన్ని హస్తగతం చేసుకున్నామని, 20 ఏళ్ల తర్వాత పార్టీ కట్టబెట్టిన అదే బాధ్యతతో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం గర్వంగా ఉన్నదని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడికను తొలగించి, నిల్వ సామర్థ్యాన్ని పెంచే పనులను యుద్ధప్రాతిపదికన చేపడతామన్నారు. 20, 21 ప్యాకేజీల పనులను వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా నుంచి రికార్డు స్థాయిలో వరి సాగు, కొనుగోళ్లు కాంగ్రెస్ హయాంలోనే అధిక మొత్తంలో జరుగుతోందన్నారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామక్రిష్ణ, గడుగు గంగాధర్, తాహెర్ బిన్ హందాని, కేశ వేణు రత్నాకర్ పాల్గొన్నారు.