5 September, 2026 | 5:50 AM

సర్పంచ్ భర్తల పెత్తనం..

05-09-2026 | 04:40am
  1. పదవుల్లో సతులు.. పవర్‌లో పతులు!
  2. వీళ్ళకే పరిమితమవుతున్న మహిళా సర్పంచులు
  3. వారి స్థానంలో పెత్తనం చెలాయిస్తున్న భర్తలు
  4. మహిళా సాధికారత లక్ష్యానికి గండి
  5. బోధన్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆరోపణలు..
  6. అధికారులకు ఫిర్యాదులు
  7. పంచాయతీ వార్డు మెంబర్ వరకు ఇదే తలుపు
  8. ఆమె కాదు అతనే సర్పంచ్

బోధన్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): స్థానిక సంస్థల్లో మహిళలకు రాజకీయంగా అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం రిజర్వేషన్లు(Reservations) అమలు చేస్తున్నప్పటికీ.. కొన్ని గ్రామాల్లో ఆ లక్ష్యం నీరుగారుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలు సర్పంచులు, వార్డు సభ్యులుగా ఎన్నికైనా.. వారి స్థానాల్లో భర్తలు, కుటుంబ సభ్యులే పెత్తనం చెలాయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

పదవుల్లో సతులు.. పవర్‌లో పతులు 

అన్న చందంగా పరిస్థితి మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా ప్రజాప్రతినిధులు అధికారికంగా పదవుల్లో ఉన్నప్పటికీ, గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులు, పంచాయతీ వ్యవహారాలు, అధికారులతో సమన్వయం వంటి అంశాల్లో వారి భర్తలే ముందుండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో ‘ఆమె కాదు.. అతనే సర్పంచ్’, ‘కుర్చీ ఒకరిది.. పాలన మరొకరిది’ అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇళ్లకే పరిమితమవుతున్న మహిళా సర్పంచులు

మహిళా సాధికారత కోసం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించినప్పటికీ కొందరు మహిళా సర్పంచులు పాలనలో స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామ పర్యటనలు, అభివృద్ధి పనుల పరిశీలన, గ్రామసభలు, అధికారులతో సమావేశాలు తదితర కార్యక్రమాల్లో సర్పంచుల భర్తలే చురుకుగా పాల్గొంటున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.

కొన్ని చోట్ల మహిళా సర్పంచులు కేవలం సంతకాలకే పరిమితమవుతున్నారని, ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం వారి భర్తలే పాల్గొంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు గ్రామాలకు వచ్చిన సందర్భాల్లోనూ మహిళా ప్రజాప్రతినిధుల కంటే వారి భర్తలే ముందుండటం విమర్శలకు దారితీస్తోంది.

అధికారులపై ఒత్తిళ్లు?

గ్రామ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలతో పాటు ఇతర క్షేత్రస్థాయి సిబ్బందికి సైతం సర్పంచుల భర్తలు ఆదేశాలు ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ మాట వినకపోతే అధికారులపై ఒత్తిడి తీసుకురావడం, బదిలీల పేరుతో హెచ్చరించడం వంటి ఘటనలు కొన్ని చోట్ల జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.

మండల స్థాయిలోనూ మహిళా ప్రజాప్రతినిధుల పేరుతో వారి భర్తలు అధికారులపై ప్రభావం చూపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులు, సంక్షేమ కార్యక్రమాల్లోనూ అనధికార జోక్యం పెరుగుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిధుల వ్యవహారాల్లోనూ జోక్యం

కొన్ని గ్రామ పంచాయతీల్లో పంచాయతీ నిధుల వినియోగం, అభివృద్ధి పనులు, చెక్కులపై సంతకాలు తదితర వ్యవహారాల్లో సర్పంచుల భర్తలు జోక్యం చేసుకుంటున్నారనే ఫిర్యాదులు అధికారులకు అందుతున్నాయి. అయితే, ఈ ఆరోపణలు చోటుచేసుకున్న ప్రతిచోటా వాస్తవ పరిస్థితిని అధికారులు విచారించి నిర్ధారించాల్సిన అవసరం ఉంది. గ్రామసభల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులే అధికారికంగా వ్యవహరించాల్సి ఉండగా.. వారి స్థానంలో కుటుంబ సభ్యులు నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగించే అవకాశం ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

బోధన్ మండలంలోనూ ఫిర్యాదు

బోధన్ మండలంలోని ఓ గ్రామంలో సర్పంచ్ భర్త పంచాయతీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ వార్డు సభ్యులు జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఇలాంటి ఘటనలు నియోజకవర్గంలోని ఇతర గ్రామాల్లోనూ జరుగుతున్నాయని, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

జిల్లాలో పలు ఘటనలు

నిజామాబాద్ రూరల్ మండలంలోని ఓ గ్రామంలో సర్పంచ్కు బదులుగా ఆమె భర్త పెత్తనం చెలాయిస్తున్నారని మాజీ సర్పంచ్, కొందరు గ్రామస్తులు కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మహిళా భవన నిర్మాణ స్థలం విషయంలో వివాదం నెలకొన్నట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. మద్నూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ.. గత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదన్న కారణంతో సర్పంచ్ భర్త తన ఇంటి నిర్మాణానికి సంబంధించి నోటీసు ఇచ్చారని అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. డిచ్పల్లి మండలంలోని ఓ గ్రామంలో పంచాయతీ పాలన, ఆర్థిక లావాదేవీల్లో సర్పంచ్ భర్త జోక్యం చేసుకుంటున్నారని వార్డు సభ్యులు డీఎల్పీవోకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టినట్లు తెలిసింది.

అడ్డుకట్ట వేయాల్సిన అవసరం

ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులే తమ అధికారాలను స్వతంత్రంగా వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సర్పంచ్ భర్తలు లేదా ఇతర కుటుంబ సభ్యుల అనధికార జోక్యంపై వచ్చే ఫిర్యాదులను విచారించి, వాస్తవాలు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మహిళా సర్పంచులపై భర్తల పెత్తనానికి చెక్?

మహిళా సర్పంచుల పేరుతో వారి భర్తలు లేదా ఇతర పురుష బంధువులు పరోక్షంగా అధికారాన్ని చెలాయించే పరిస్థితిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ పలు సూచనలు చేసినట్లు సమాచారం. మహిళా ప్రజాప్రతినిధులకు వ్యవస్థాగతంగా ప్రభుత్వ సహకారం అందించాలని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించినట్లు పేర్కొంటున్నారు.

ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులతో ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి.. పాలనలో ఎదురయ్యే సమస్యలపై వారికి మార్గదర్శకత్వం, సహాయం అందించాలని సూచించినట్లు సమాచారం. మహిళలకు పదవులు మాత్రమే కాకుండా.. ఆ పదవులకు సంబంధించిన అధికారాలు, నిర్ణయాధికారం కూడా వారికే దక్కేలా చర్యలు తీసుకోవాలని బోధన్ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు