1 May, 2026 | 4:08 AM

దారంతా ధాన్యపు రాశులే..

01-05-2026 02:19 AM

కల్లాలు లేక రైతుల అవస్థలు

రోడ్లపై ఆరబెట్టిన పంటలతో వాహనదారులకు ప్రమాద ముప్పు

కల్వకుర్తి / చారకొండ ఏప్రిల్ 30: రైతులు పండించిన ధాన్యాన్ని కోసి ఆరబెట్టేందుకు సరైన స్థలాలు లేక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. మార్కెట్కు తరలించిన ధాన్యాన్ని కూడా సరైన సమయంలో కొనుగోలు చేయక రోజుల తరబడి మార్కెట్ లోనే తలదాచుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. కోతల అనంతరం పంటలను ఎక్కడ ఆరబెట్టాలో తెలియక, చాలామంది రైతులు రోడ్లపైనే మొక్కజొన్న, వరి ధాన్యాన్ని పరచి ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పంటలన్నీ ఒకేసారి కోతకు రావడం, గ్రామాల్లో కల్లాలు లేకపోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమైంది.నాగర్ కర్నూల్ జిల్లాలోని హైదరా బాద్- శ్రీశైలం, కల్వకుర్తి-కొల్లాపూర్, 167 జాతీయ రహదారి, నాగర్ కర్నూల్-అచ్చంపేట, నాగర్ కర్నూల్-కొల్లాపూర్ వంటి ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ ప్రాంత లింకు రోడ్లన్నీ ఇప్పుడు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి.

కోదాడ - జడ్చర్ల జాతీయ రహదారితో పాటు, చారకొండ - ఇర్విన్ ప్రధాన రహదారిపై రైతులు తమ పంటను నూర్పిడి కోసం కుప్పలుగా పోస్తుండటంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వ స్తోంది. ముఖ్యంగా జడ్చర్ల - కోదాడ జాతీయ రహదారిపై జూపల్లి, తిమ్మాయిపల్లి, తుర్కలపల్లి, మర్రిపల్లి వద్ద, అలాగే చారకొండ - ఇర్విన్ రహదారిపై సూర్య గేట్ తండా సమీపంలో రైతులు తమ పంటను నూర్పిడి కోసం కుప్పలుగా పోస్తుండటంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఏటా సాగు కాలం ముగియగానే ఈ రహదారులన్నీ కల్లాలుగా మారిపోతున్నాయి.

కళ్లుగప్పుతున్న వెలుగులు.. కాటేస్తున్న ప్రమాదాలు.!

పగటిపూట పరిస్థితి ఎలా ఉన్నా, రాత్రి వేళల్లో ఈ రహదారులపై ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. ఎదురుగా వచ్చే వాహనాల హైబీమ్ లైట్ల ఫోకస్ వల్ల రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పలు ఏమాత్రం కనిపించడం లేదు. దీంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి ఆ కుప్పలపై పడి తీవ్రంగా గాయపడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఈ గ్రామాల్లోని ప్రధాన రహదారులపై చిన్నపాటి ప్రమాదాలు నిత్యకృత్యమ య్యాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండించిన పంటను ఆరబోయడా నికి గ్రామాల్లో సరైన కల్లాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు గత్యంతరం లేక రోడ్లను ఎంచుకుంటున్నారు.

అధికారుల నిర్లక్ష్యం.

రహదారుల పర్యవేక్షణ చూడాల్సిన ఆర్‌అండ్బీ అధికారులు, జాతీయ రహదారి అధికారులు ఈ సమస్యపై కనీసం దృష్టి సారించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమాల్ పూర్ గేట్, తిమ్మాయిపల్లి వంటి కీలక ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతున్నా పెట్రోలింగ్ నిర్వహించడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించకముందే ఉన్నతాధికారులు స్పందించి ప్రత్యామ్నాయ నూర్పిడి ప్రదేశాలు ఏర్పాటు చేయడంతో పాటు రహదారులపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.