అధికారుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం
- మొక్కజొన్న ధాన్యం భద్రపరిచేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై మండిపాటు.
- జిన్నింగ్ మిళ్లను అద్దెకు తీసుకోవాలని ఆదేశం.
- ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు.
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 30 ( విజయక్రాంతి ): ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అ ధికారుల అలసత్వం పై జిల్లా కలెక్టర్ హే మంత్ కేశవ్ పాటిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న కొనుగోలు ధాన్యం తరలింపు భద్రపరిచే ఏర్పాట్ల అంశంపై నిర్లక్ష్యం వహించిన పలు శాఖలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పంట దిగుబడి అంచనా ఉన్నప్పటికీ కొనుగోలు, రవాణా, భద్రపరిచే స్థలాలను ముందే ఏర్పాటు చేసుకోకపోవడంతో రైతులు ఇబ్బందులకు గుర వుతున్నారని వెంటనే అందుకు ప్రత్యామ్నా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధ్యక్షతన మార్క్ఫెడ్, పౌరసరఫరాల శాఖ అధికారులు, జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కజొన్న పంట దిగుబడి అంచనా ముందే ఉన్నప్పటికీ మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి అందుకు సరిపడా లారీలు, లేబర్, గోదాముల ఏర్పాట్లను ముందే చూసుకోవాల్సి ఉండేదన్నా రు. అందుకు ప్రత్యామ్నాయంగా జిల్లాలోని 18 జిన్నింగ్ మిల్లులను అద్దె ప్రాతిపదికన తీసుకొని దాన్యం వెనువెంటనే తరలించాలని ఆదేశించారు.
అందుకు కొంతమంది జిన్నింగ్ మిల్ యజమానులు నిరాశక్తి ఉన్నప్పటికీ మానవతా దృక్పథంతో ఆలోచించా లని సూచించినట్లు తెలిసింది. ఆగస్టు చివరి నాటికి భద్రపరిచిన మొక్కజొన్న ధాన్యాన్ని ఖాళీ చేసే విధంగా సానుకూలత చూపడంతో వెంటనే ధాన్యం తరలింపు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. కొంతమంది తెర వెనుక హమాలీలను రెచ్చగొడుతూ ఇబ్బందులు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు గుర్తించారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలోనూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఆయా మార్కెట్లలో కనీస వసతులు లేక రైతులు ఇబ్బందులు గురవుతున్నారని తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.






