పాల్వంచలో ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలి
బీజేపీ నేత పొనిశెట్టి వెంకటేశ్వర్లు
పాల్వంచ, జూన్ 30 (విజయక్రాంతి): పాల్వంచ పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులను తీవ్రంగా దోచుకుంటున్నాయని బీజేపీ నేత పొనిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి (ౄEO) వాసంతిని కలిసి ప్రైవేట్ పాఠశాలల అక్రమాలపై ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేయడం, యూనిఫార్మ్లు, పుస్తకాలు, బ్యాగులు, షూస్, సాక్స్ తదితర వస్తువులను తప్పనిసరిగా పాఠశాలల్లో , వారు సూచించిన దుకాణాల్లోనే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. నర్సరీ వంటి చిన్నారులకు కూడా అవసరానికి మించిన పుస్తకాలు, నోట్బుక్స్ పేరుతో రూ 4 నుండి 5వేల వరకు వసూలు చేస్తున్నారని విమర్శించారు.
అనేక పాఠశాలల్లో పార్కింగ్ సౌకర్యం, ఆటస్థలాలు, తాగునీటి సౌకర్యం, అగ్నిమాపక భద్రత, భవన భద్రత వంటి కనీస మౌలిక వసతులు కూడా లేవని పేర్కొన్నారు. పాఠశాలల్లో ఉన్న సమస్యలను తల్లిదండ్రులు ప్రశ్నిస్తే వారి పిల్లలపై వివక్ష చూపుతున్నారని, దీంతో చాలామంది భయంతో మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పాల్వంచలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలనీ, అవసరమైతే గుర్తింపును కూడా రద్దు చేయాలి అని పొనిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దున్నపోతుల రాజు, భూక్యా మోహన్, మాలోత్ ప్రశాంత్ ,భట్టు అశోక్ పాల్గొన్నారు.






