రైతన్న గుండెకోత
వ్యవసాయ విద్యుత్ సరఫరాపై ఆందోళన
- అప్రకటిత కోతలు విధిస్తున్నారంటూ ఆగ్రహం
- రోడ్డెక్కిన అన్నదాతలు.. పలుచోట్ల నిరసనలు
- వానాకాలం పంట చివరి దశలో ఉందని ఆవేదన
- 12 గంటలు సరఫరా చేస్తున్నామంటున్న అధికారులు
సంగారెడ్డి బ్యూరో, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావం.. వర్షాల లేమి.. రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్దెత్తున దెబ్బతీసింది. తాజాగా, వ్యవసాయ విద్యుత్ సరఫరా(Agricultural electricity supply)లో కొంతకాలంగా కోతలు విధిస్తున్నారనే ప్రచారం రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. వేసిన కొద్దిపాటి పంటలు కూడా చేతికందవేమోనని ఆవేదనకు లోనవుతున్నారు. రైతులకు(Farmers) మళ్లీ కరెంట్ కష్టాలు(Power Woes) తప్పవేమోనని గుబు లు చెందుతున్నారు. వాన దేవుడే కన్నీళ్లు మిగిల్చాడంటే.. ప్రభుత్వం విద్యుత్ కోతలతో తమకు గుండెకోతే మిగులుతుందేమోనని మథన పడుతున్నారు.
నెల రోజులుగా వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో అంచెలవారీగా కోతలు విధిస్తున్నారని కర్షకులు ఆరోపిస్తున్నారు. తాజాగా రోజుకు కేవలం 7 గంటలు మాత్రమే విద్యుత్ పంపిణీ చేస్తారన్న ప్రచారంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారికంగా కోతలు విధిస్తున్నట్లు ప్రకటన రాకపోయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అనధికారికంగా కోత లు విధిస్తున్నారని రైతులు ఆందోళనలు చేపడుతున్నారు.
మరోవైపు విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉండడం, వర్షాభా వం, ఎల్-నినో ప్రభావం వల్ల డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. కానీ వ్యవసాయానికి మాత్రం 12 గంటల పాటు నిరంతరంగా సరఫరా చేస్తున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎల్-నినో ప్రభావంతో రుతుపవనాలు మొహం చాటేసి, సరైన వర్షాలు లేక కేవలం భూగర్భ జలాలు, బోరుబావుల ఆధారంగానే పంటలు సాగు చేసుకుంటున్న అన్న దాతలకు విద్యుత్ కోతలు విధిస్తే తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడుతాయని వాపోతున్నారు.
రోడ్డెక్కుతున్న రైతులు..
ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచే అన్నదాతల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా తయారైంది. పంట నాట్లు వేసిన నాటి నుంచి నేటి వరకు యూరియా, ఎరువుల బస్తాల కోసం మండల కేంద్రాల్లో రాత్రింబవళ్లు పడిగాపులు కాశారు. ఆఖరికి వందల కిలోమీటర్ల దూరం ఇతర ప్రాంతాలకు వెళ్లి అధిక ధరలకు యూరియాను కొనుగోలు చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పంటలను చీడపీడల నుంచి కాపాడుకునేందుకు వేల రూపాయలు అప్పులు చేసి పురుగుల మందులు పిచికారీ చేశారు.
ఇప్పుడు పంట నెలరోజుల్లో చివరి దశకు వచ్చి చేతికి పంట అందే సమ యంలో విద్యుత్ కోతలు విధించి రైతుల కడుపు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటికే రైతులు ఆందోళన చేపడుతున్నారు. విద్యుత్ కోతలకు నిరసనగా సిద్దిపేట-హనుమకొండ రహదారిపై నంగు నూరు మండలం అక్కెనపల్లి రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. అలాగే చిన్నకోడూరు మండలం కమ్మరపల్లి, విఠలాపూర్ విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద రైతులు ధర్నా చేపట్టా రు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని ఎల్లంపేట విద్యుత్ స్టేషన్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు.
సీఎం హామీ నిలబెట్టుకోవాలి..
కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ హామీని తుంగ లో తొక్కిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తుంటే తమది రైతు ప్రభుత్వమని కచ్చితంగా 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) హామీనిచ్చారు. అయితే ప్రస్తుతం పలు జిల్లాల్లో అనధికార కోతలు విధిస్తున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. 12 గంటలు సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా అమలులో మా త్రం లేదని సిద్దిపేట జిల్లాలో ధర్నా చేపట్టిన రైతులు ఆరోపించారు. ఖరీఫ్ పంటలు చివ రి దశకు చేరుకున్న సమయంలో విద్యుత్ కోతలు విధించకుండా నిరంతరాయంగా స రఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకొని రైతులను ఆదుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యా ప్తంగా లక్షలా ది ఎకరాల్లో రైతు లు పంట లు నష్టపోయే ప్రమా దం ఉందని ఆవేదన చెందుతున్నారు. కాగా ఇదే విషయ మై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను విజయక్రాంతి ప్రశ్నించగా విద్యుత్ డిమాండ్ పెరిగిన మాట వాస్తవమేనని, దానికి వర్షాభావం, ఎల్-నినో ప్రభావం కారణమని తెలి పారు. అయినప్పటికీ 12 గంటల పాటు నిర ంతర విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు.