12 June, 2026 | 1:24 AM

చింతలకుంటలో నల్లమట్టి లూటీ.. ఆపేదెవరు?

12-06-2026 12:00 AM

అనుమతి మొర్రానికి.. తవ్వకాలు నల్లమట్టికి!

చారకొండ, జూన్ 11: చారకొండ మండలం శిరుసనగండ్ల గ్రామ శివారులోని చింతలకుంటలో నల్లమట్టి అక్రమ తవ్వకాలు మళ్లీ జోరందుకున్నాయనే ఆరోపణలున్నాయి. ఇటీవల విజయక్రాంతి దిన పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చిన వార్త కథనాల నేపథ్యంలో అధికారులు రెండు రోజుల పాటు తవ్వకాలను నిలిపివేసినా, ఆ తర్వాత మళ్లీ యథేచ్ఛగా అక్రమ రవాణా కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. మైనింగ్ శాఖ నుంచి మొరం తవ్వకాలకు మాత్రమే పరిమిత అనుమతులు ఉన్నప్పటికీ, నాలుగు భారీ హిటాచీలతో దాదాపు 10 అడుగుల లోతు వరకు తవ్వి నల్లమట్టిని తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

రోజుకు 150 నుంచి 200 ట్రిప్పుల వరకు నల్లమట్టి బయటకు వెళ్తోందని, దీంతో లక్షల రూపాయల అక్రమ వ్యాపారం జరుగుతోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. భారీ తవ్వకాల వల్ల చింతలకుంట స్వరూపం మారిపోగా, భూగర్భ జలాలు, వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధిక లోడ్తో వెళ్తున్న టిప్పర్ల కారణంగా గ్రామీణ రహదారులు పూర్తిగా దెబ్బతింటున్నాయని స్థానికులు వాపోతున్నారు.

ఇంత పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, అధికార పార్టీ నేతల అండదండలతోనే ఈ దందా కొనసాగుతోందనే చర్చ మండల వ్యాప్తంగా సాగుతోంది. ఈ వ్యవహారం తెలిసిన జిల్లా అధికార యంత్రాంగం కూడా అంటి ముట్టనట్లు వ్యవహరించడం వెనుక భారీగా ముడుపులు చేతులు మారాయన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అక్రమ తవ్వకాలపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.