శ్రమ చిందిన జ్వాల
రాళ్లను మలచి రూపమిస్తే
పుట్టిన రాజమహల్లో
సోమరిపోతుల నవ్వులు
నెత్తురు నీరుగా మార్చి
కట్టిన మేడల్లో కులికే గుంటనక్కలు
మా కన్నీళ్లే ఇంధనమైతే
పారేటీ మీ సిరి సంపదలు
మా ఊపిరి ఇచ్చి యంత్రాలకు
ప్రాణం పోయగా తెగేటి మా పేగులు
మేము నలుగుతూ చేసిన
వస్తువులే మీకు వైభోగాలు
ఆ ఇనుప హోరులో మీరు
అణచివేసేటి మా ఆకలి కేకలు
మా మాంసం ముద్దలతో
ధగధగ మెరిసే రోడ్డుపై మీ
విలాసాల రథాలు
మా అస్థిపంజరాలపై
పయనిస్తున్నాయి
అరచేతులు కాయలు కాచి
అడవిని ఊరుగా మలిస్తే
ఆ ఊరి పొలిమేరల్లో
మా బతుకులు చిధ్రమవుతున్నాయి!
చెమట చుక్కను చమురుగా
మార్చి మీరు దీపాలు వెలిగిస్తే
మా గూడు మాత్రం నిత్యం చీకటిలోనే మగ్గుతోంది
మా రక్తాన్ని తాగే రాక్షస రాజ్యమా...!
ఇక చాలు నీ ఆటలు...
కష్టజీవి కన్ను తెరిస్తే...
కాలం మారుతుందని తెలుసుకో
సృష్టికి వలం మా శ్రమే...
చరిత్రకు సాక్ష్యం మా చెమటే
మా శ్రమను దోచిన సామ్రాజ్యాలు కూలే రోజు వస్తుంది
ఆకలి మంటల జ్వాలల్లో నవ సమాజం ఉదయిస్తుంది!
దుప్పటి మొగిలి
8466827188






