1 April, 2026 | 2:00 AM

క్షేమంగా ఇంటికి చేరడమే ‘అరైవ్ - అలైవ్’ లక్ష్యం

01-04-2026 12:27 AM

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎస్పీ స్నేహ మెహ్ర 

కొడంగల్, మార్చి 31 (విజయక్రాంతి): వాహన చోదకులకు ఆరోగ్యం, కంటి చూపు బాగున్నప్పుడే రోడ్డు ప్రమాదాలు నివారించగలం అని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక‘ కార్యక్రమంలో భాగంగా కొడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన ’అరైవ్ - అలైవ్’  మరియు డ్రగ్స్ నివారణ అవగాహన పై అవగాహన సదస్సు నిర్వహించారు..

ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ  స్నేహ మెహ్ర  ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్రైవర్ల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని  పరిశీలించి, పలువురికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర మాట్లాడుతూ...నేటి యువత దేశానికి వెన్నెముక అని, అటువంటి యువశక్తిని నిర్వీర్యం చేసేందుకు డ్రగ్స్ మాఫియా పన్నుతున్న కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు .

డ్రగ్స్ అనే మత్తు ఊబిలో చిక్కుకుని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల సరఫరా గురించి ఎలాంటి సమాచారం ఉన్నా భయం లేకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని ఎస్పీ గారు  భరోసా ఇచ్చారు. అనంతరం ’అరైవ్ - అలైవ్’ కార్యక్రమ ఉద్దేశాన్ని వివరిస్తూ.. ప్రతి రోజూ ఉపాధి కోసం బయటకు వెళ్లే వ్యక్తులు తిరిగి క్షేమంగా తమ కుటుంబ సభ్యుల వద్దకు చేరుకోవడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ముఖ్యంగా వాహనదారులు, డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను  పాటించాలని, రోడ్డు భద్రత పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు చూపు స్పష్టంగా ఉండటం అత్యంత కీలకమని, అందుకే డ్రైవర్ల కోసం ఈ ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతి డ్రైవర్ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ఆమె పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్‌ఐ సత్యనారాయణ, ఎంవీఐ వసంత్, కొడంగల్ వైస్ చైర్మన్ శంకర్, స్థానిక కౌన్సెలర్లు, పోలీస్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో యువత, వాహనదారులు పాల్గొన్నారు.