విప్లవాగ్ని.. ఐలమ్మ
తెలంగాణ నేలపై పుట్టిన ధీర వనిత, అన్యాయాలను ఎదిరించిన వీరనారి.. చాకలి ఐలమ్మ(Chakali Ilamma). పే దల హక్కుల కోసం దొరలపై మర్లబడి.. రజాకార్ల గుం డెల్లో వణుకుపుట్టించిన ఆమె ప్రతి అడుగు, నడిచిన ప్రతి తొవ్వ.. ఆదర్శనీయం. తరతరాలకు తరగని స్ఫూర్తి ఆమె. తెలంగాణ సాయుధ పోరాటంలో మడమ తిప్పని పోరాట యోధురాలిగా నిలిచిపోయారు.
భూమి నాది.. పంట నాది.. దొరెవ్వడు?
1895 సెప్టెంబర్ 26న ఐలమ్మ జన్మించారు. వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామానికి చెందిన ఓరుగంటి మల్లమ్మ, సాయిలు దంపతుల నాల్గో సంతానం. పాలకుర్తి వాసి చిట్యాల నర్సయ్యతో ఐలమ్మకు పెండ్లి జరిగింది. వీరికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం.. చాకలి కులవృత్తే వారికి జీవనాధారం. 1940 మధ్య కాలంలో విస్నూర్‌లో దేశ్‌ముఖ్, రజాకార్ల అరాచకాలను ఐలమ్మ ఎదిరించి ఎర్రజెండా ను రెపరెపలాడించారు. “ఈ భూమి నాది.. పండిం చిన పంట నాది.. తీసుకెళ్లడానికి దొరెవ్వడు.. ” అంటూ దొరల గడీల్లో రైతాంగ విప్లవాగ్నిని ఆమె రగిలించారు.
రోకలిబండ చేతబూని..!
నాడు మల్లంపల్లి భూస్వామి కొండలరావుకు పాలకుర్తిలో 40 ఎకరాల భూమి ఉండగా ఐలమ్మ కౌలుకు తీసుకుని ౪ ఎకరాల్లో పంట వేశారు. అది గిట్టని పాల కుర్తి పట్వారీ వీరమనేని శేషగిరిరావు కుట్రలు పన్నాడు. కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచేయాలని ఐలమ్మను ఆదేశించాడు.దానికి ఆమె నిరాకరించారు. అప్ప టికే ఆంధ్రమహాసభలో ఐలమ్మ సభ్యురాలు. పాలకుర్తి పట్వారీ పప్పులుడకక.. ఆమె కుటుంబం కమ్యూనిస్టుల్లో చేరిందని దేశ్‌ముఖ్ రాపాక రాంచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశాడు. పలు కేసుల్లో ఐలమ్మ కుటుంబాన్ని ఇరికించారు. అయితే.. న్యాయస్థానంలో దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. న్యాయపోరాటంలో ఐలమ్మకు కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారం అందించారు.
ఓటమిని జీర్ణించుకోలేకపోయిన దేశ్‌ముఖ్ రాం చంద్రారెడ్డి.. ఐలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీ యాలని పట్వారీని పిలిపించుకొని, ఐలమ్మ కౌలుకు తీసుకున్న భూమిని తన పేరున రాయించుకున్నా డు. భూమి, పండించిన ధాన్యం తనదేనని గూండాలను పంపాడు. వారిని ఐలమ్మ ఎదిరించారు. దీంతో మరిం త ఆక్రోశం పెంచుకున్న దేశ్‌ముఖ్.. ఐలమ్మ ఇంటిని తగులబెట్టించాడు. ఆమె కూతురుపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ అన్యాయాలపై ఐలమ్మ మరింత రగిలి పోయారు. కుమారులతో కలిసి పాలకుర్తి పట్వారీ ఇంటిని ముట్టడించి ఇంటికి నిప్పు పెట్టించారు. రోకలి బండ చేతబూని గూండాలను తరిమికొట్టారు.
ప్రజా పోరాటాలకు స్ఫూర్తి
నాడు ఐలమ్మ భూపోరాట విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యాన్ని, 90 ఎకరాల భూమిని పంచారు. అనంతరం 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది. ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ 1985 సెప్టెంబర్ 10న కనుమూశారు. నేటికీ ఆమె పోరాటం స్ఫూర్తిదాయకం.
వ్యాసకర్త: తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, 9848445134
కామిడి సతీశ్‌రెడ్డి