నిమజ్జన సమస్య..!
- ఓవైపు ఘనంగా ఏర్పాట్లు
మరోవైపు నిమజ్జన దిగులు
గణనాథులకు ఎల్నినో గండం
మహబూబాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): వినాయక చవితి (Vinayaka Chavithi) పర్వదిన వేడుకలకు ఓవైపు ఘనంగా ఏర్పాటు చేస్తున్నప్పటికీ, మరోవైపు నిమజ్జనం ఎలా చేయాలనే అంశం ఇప్పుడు నిర్వాహకులకు పెద్ద దిగులుగా మారింది. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో గణపతి నవరాత్రి వేడుకల అనంతరం విగ్రహాలను నిమజ్జనం చేయడం ఎలా అంటూ ఆందోళన చెందుతున్నారు.
తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా ఎలాంటి విజ్ఞాలు కలగకుండా కొలిచిన గణనాథులను చెరువులు, జలాశయాల్లో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజులపాటు గణనాధులకు పూజలు నిర్వహించి ఆటపాటలతో పదో రోజు శోభాయాత్ర నిర్వహించి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు.
ఎల్ నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితుల్లో గ్రామాల నుండి మొదలుకొని పట్టణాల వరకు ఎక్కడ కూడా చిన్నపాటి విగ్రహం కూడా మునిగేంత నీళ్లు లేకపోవడంతో నవరాత్రి ఉత్సవాల అనంతరం విగ్రహాల నిమజ్జనం ఎక్కడ చేయాలనేది ఇప్పుడు నిర్వాహకులకు పెద్ద సమస్యగా మారింది. దీనితో చాలా చోట్ల ఈసారి గణనాధుల మండల నిర్వాహకులు ముందుగా నిమజ్జన పరిస్థితిపై ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.
కొన్నిచోట్ల గతంలో మూడు నాలుగు విగ్రహాలను ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఇప్పుడు, సమిష్టిగా ఒకచోట విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనివల్ల ఈసారి విగ్రహాల ఏర్పాటు, మండల్ల సంఖ్య కొంత తగ్గే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. విగ్రహావిక్రయదారులు కూడా విగ్రహాల అమ్మకాలపై కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో మాదిరిగా విగ్రహాల కోసం గిరాకీ ఆశించినంతగా లేదని చెబుతున్నారు. ఓవైపు ముడి సరుకు ధర పెరిగిందని, విగ్రహాల తయారీ ఖర్చు కూడా పెరిగిందని, ఎల్ నినో ప్రభావంతో విగ్రహాల కొనుగోళ్ల కు ఆశించిన డిమాండ్ లేకపోవడం వల్ల నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు.
అంతా గణనాథుడి దయ
అనేకసార్లు వినాయక చవితి పండగ ముందు వరకు ఇలాంటి కరువు పరిస్థితి చాలా సార్లు కనిపించిందని, అయితే వినాయకున్ని నిలబెట్టిన తర్వాత కూడా ఒక్కరోజే భారీ వర్షం కురిసి చెరువులు నిండిన సంఘటనలు కూడా అనేకం జరిగాయని చెబుతున్నారు.
అంతా గణనాథుడి దయ.. వినాయక నిమజ్జనం వరకు దండిగా వర్షాలు కురిసి చెరువులో నిండాలని ఆశిస్తున్నాం. ఒకవేళ ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో వర్షాలు అప్పట్లోగా కురవకపోతే విగ్రహాన్ని గోదావరి, కృష్ణానదుల్లో నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తాం.
వినాయక మండలి నిర్వాహకుడు, కేసముద్రం