రైల్వే మల్టీ ట్రాకింగ్ ఏర్పాటు హర్షనీయం
- ఆమోదం తెలిపిన కేంద్రం
- హర్షం వ్యక్తం చేసిన ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): ప్రధాని మోదీ(Prime Minister Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ(Cabinet Committee on Economic Affairs) సమావేశంలో తెలంగాణ(Telangana)కు అత్యంత ప్రయోజనకరమైన సికింద్రాబాద్(Secunderabad) (ఘట్‌కేసర్)-కాజీపేట బహుళ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టు(Kazipet Multi-tracking Railway Project)కు ఆమోదం లభించింది. దీని పట్ల బీజేపీ ఎంపీ, రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడు డా.కె.లక్ష్మణ్(K Laxman) హర్షం వ్యక్తం చేస్తూ గురువారం ప్రటకనను విడుదల చేశారు.
ఈ నెల 9న కేంద్ర ప్రభుత్వం(Central Government) దేశవ్యాప్తంగా ఎనిమిది రైల్వే మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులకు రూ.20,804 కోట్లతో ఆమోదం తెలిపిందని, ఇందులో తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన ఐదు కీలక ప్రాజెక్టులకు రూ.10,021 కోట్ల పెట్టుబడితో ఆమోదం లభించిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు మొత్తం 540 కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని అభివృద్ధి చేయనున్నాయని తెలిపారు.
సికింద్రాబాద్ (ఘట్‌కేసర్)-కాజీపేట మార్గం తెలంగాణ రైల్వే వ్యవస్థకు జీవనాడి వంటిదని తెలిపారు. 2029-30 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రాజెక్టు తెలంగాణను జాతీయ సరకు రవాణా, పారిశ్రామిక కారిడార్లతో మరింత బలంగా అనుసంధానిస్తుందని వెల్లడించారు. ఈ మార్గంలో బహుళ ట్రాకింగ్ చేపట్టడం ద్వారా రైళ్ల రద్దీ తగ్గి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయని, సరుకు రవాణా వేగవంతమై, తెలంగాణ పరిశ్రమలు, రైతులు, వ్యాపారులు, యువతకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుందన్నారు.