2 June, 2026 | 1:18 AM

వక్ఫ్ భూముల సమస్యను పరిష్కరించాలి

02-06-2026 12:06 AM

వక్ఫ్ బోర్డు చైర్మన్ కు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వినతి

మేడ్చల్, జూన్ 1(విజయక్రాంతి): మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో వక్ఫ్ భూముల సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ ను కలిసి విన్నవించారు. ప్రభావిత ప్రాంతాల కాలనీ సంఘాల ప్రతినిధులతో కలిసి  వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజమాతుల్లా హుస్సేనీ ని ఆయన కార్యాలయంలో  కలిసి సమస్యలను వివరించారు

. 2024 సంవత్సరంలో తెలంగాణ వక్ఫ్ బోర్డు పొరపాటున మల్కాజ్గిరి పరిధిలోని సర్వే నంబర్లు 3, 103, 104, 105 , 144 నుండి 154 వరకు 22-A నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చడంతో న్యూ విద్యానగర్, ఓల్ నేరెడ్మెట్, రాంబ్రహ్మనగర్, దేవినగర్ ఎక్స్టెన్షన్, దేవినగర్, సైనిక్ నగర్, సీతారాం నగర్ , కృష్ణా నగర్ ప్రాంతాల్లో ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు.

ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ గెజెట్ నం.35 పార్ట్-II (27.08.1987), గెజెట్ నం.37 పార్ట్-II (13.10.2001) ప్రతులను పరిశీలించగా, అలాగే హైకోర్టులోని C.R.P. నం.5057/ 2008 కేసు ఆధారంగా సంబంధిత సర్వే నంబర్లు మల్కాజ్గిరికి కాకుండా ఉప్పల్ మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందినవని స్పష్టమైనట్లు ఎమ్మెల్యే  వివరించారు.

కాలనీ సంఘాల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  ఇప్పటికే ఐదు సార్లు తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్, సీఈఓలను కలిసి సమస్య తీవ్రతను వివరించారు. సోమవారం జరిగిన సమావేశంలో కాలనీవాసుల ఆందోళనలను ఎమ్మెల్యే  వక్ఫ్ బోర్డు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా, సయ్యద్ అజమాతుల్లా హుస్సేనీ  సానుకూలంగా స్పందించారు. మల్లాపూర్ గ్రామానికి చెందిన సర్వే నంబర్లు పొరపాటున మల్కాజ్గిరి పరిధిలోని వక్ఫ్ జాబితాలో చేర్చబడినట్లు గుర్తించామని, వాటిని వెంటనే తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ఈ విషయమై ఇటీవల మంత్రి శ్రీధర్ బాబు ను కలిసి చర్చించినట్లు, వక్ఫ్ బోర్డు సీఈఓతో కూడా మాట్లాడించినట్లు చైర్మన్ వెల్లడించారు. సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటామని, ప్రభావిత కాలనీవాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో న్యూ విద్యానగర్, ఓల్ నేరెడ్మెట్, రాంబ్రహ్మనగర్, దేవినగర్ ఎక్స్టెన్షన్, దేవినగర్, సైనిక్ నగర్, సీతారాం నగర్, కృష్ణా నగర్ ప్రాంతాలకు చెందిన ఆస్తి యజమానులు, కాలనీ సంఘాల ప్రతినిధులు, మల్కాజ్గిరి కాలనీల సమైక్య జనరల్ సెక్రటరీ బి.టి. శ్రీనివాస్, రాఘవేంద్ర, బీఆర్‌ఎస్ నాయకులు మురుగేష్, చిన్న యాదవ్, బాబురావు, జంగా రాజు, శ్రీధర్, సంపత్ యాదవ్, శివసాయి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.