2 June, 2026 | 12:47 AM

భయంకరమైన మైనింగ్ లోయలు

02-06-2026 12:08 AM

మృత్యు కుహరాలుగా మారుతున్న వైనం

జాగ్రత్తలు కరువు..

పట్టించుకోని అధికారులు

లోయలో పడి యువకుడి మృతి

తాడ్వాయి, జూన్ 1(విజయక్రాంతి): భయంకరమైన మైనింగ్ లోయలు... కంటి చూపుకు కనపడనంత లోతుగా ఉన్న గుంతలు.. ఇష్టం వచ్చినట్లు తవ్వకాలు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే లోతుగా లోయలు.. ఈ లోతైన లోయలు మృత్యు కుహరాలు గా మారుతున్నాయి.

ఈ లోయలు ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి పరిధిలోని అబ్దుల్లా నగర్ శివారులో నెలకొన్న కంకర మిషన్ యాజమాన్యం ఇష్టా రీతిగా తవ్వకాలు జరుపడంతో లోతైన లోయలు ఏర్పడుతున్నాయి. ఈ లోయలు అక్కడి ప్రాంత ప్రజలకు శాపంగా మారాయి. మైనింగ్ నిర్వాహకులు ఇష్టా రీతిగా తవ్వకాలు జరిపి రాయిని వెలికి తీస్తున్నారు. ఆ రాయితో కంకర తయారు చేసి దందా చేసుకుంటున్నారు.తమ స్వార్ధ ప్రయోజనాల కోసం చేసుకునే పనులు ఇతరులకు ఇబ్బందిగా మారాయి.కానీ ఆ తవ్వకాలతో ప్రజలకు ఏర్పడే ఇబ్బందులను యాజమాన్యం  పట్టించుకోవడం లేదు.

ఎవరు అడుగుతారని..

- - మమ్మల్ని ఎవరు అడుగుతారని మేము ఎవరికి బాధ్యతగా ఉండాలి అనే కోణంలో యాజమాన్యం ఇష్టం వచ్చినట్లు తవ్వుతున్నారు.దీంతో కృష్ణాజివాడి,బ్రహ్మాజీ వాడి, సోమారం, అబ్దుల్లా నగర్ గ్రామాల శివారు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ పశువులు ఎప్పుడైనా అటువైపు వెళ్తే లోయలో జారి పడి పోయినట్లయితే మృత్యువాత పడతాయని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే పశువులు మృత్యువాత పడ్డట్లు తెలిపారు.ఇటీవల కంకర మిషన్ మైనింగ్ లోయలో పడి కృష్ణాజివాడి గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు మృత్యువాత పడ్డాడు.23 సంవత్సరాల యువకుడు మృత్యువాత పడడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.గతంలో సైతం ఈ లోయలో చాలా ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు.అయినా యాజమాన్యం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

నాయకులు, అధికారుల అండతోనే...

- - రాజకీయ పార్టీల నాయకులు, అధికారుల అండదండలతోనే కంకర మిషన్ మైనింగ్ యాజమాన్యం ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నాయకులతో కుమ్మక్కై యాజమాన్యం ఇలా లోతైన లోయలు తవ్వుతుందని వాపోతున్నారు. సంబంధిత అధికారులు యాజమాన్యంతో కుమ్మకు కావడంతోనే సదరు కంకర మిషన్ పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.మమ్మల్ని అడిగేది ఎవరు అన్నట్లు లోతైన గుంతలు తవ్వుతూ వదిలిపెడుతున్నారు.గతంలో పెద్ద పెద్ద బాంబులు అమర్చి బండరాళ్ల ను పేల్చేవారు.ఆ బండరాళ్లు పేలిపోయి పంట పొలాల్లో పడడంతో రైతులు తీవ్ర అవస్థలు పడేవారు. చాలా దూరంలో ఉన్న పంట పొలాల్లోకి సైతం వచ్చి రాళ్లు పడడం తో పొలాల్లో పనిచేసుకునే రైతులకు ఎక్కడ ప్రమాదం జరుగుతుందో నని వణికిపోయేవారు. 

ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోవాలి

- - మైనింగ్ లోయలో ప్రమాదాలు జరుగుతున్న యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నిర్వాహకులు స్పందించి భయంకరమైన లోతుగా తవ్విన లోయల చుట్టూ కంచే ఏర్పాటు చేసి రక్షణ వలయంగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు. లోయలు ఉన్న ప్రాంతాల్లో పెద్ద బోర్డులు ఏర్పాటు చేసి ఇక్కడ ప్రమాద లోయలు ఉన్నాయని రాసిపెట్టి ఉంచాలని కోరుతున్నారు. హెచ్చరిక బోర్డులు పెట్టి ప్రజలను అప్రమత్తం చేయాలని స్థానికులు కోరుతున్నారు.లేదా తవ్విన లోయలను పూడ్చివేయాలని ప్రజలు కోరుతున్నారు.