పోచారం ప్రధాన రహదారి సమస్యలు పరిష్కరించాలి
ఘట్‌కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కి వినతి
ఘట్ కేసర్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి) : పోచారం ప్రధాన రహదారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యువ నాయకులు సామల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు బుధవారం ర్యాలీగా వెళ్లి ఘట్ కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి కి వినతిపత్రం అందజేశారు. పోచారం రహదారి చాలా చిన్నదిగా ఉండగా మధ్యలో డివైడర్ ఏర్పాటు చేశారని, దీంతో ఒక వాహనం వెళ్తే మరో వాహనం పక్కకు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నట్లు తెలిపారు. ఒక వైపు మాత్రమే రహదారి ఉపయోగించు కోవాల్సి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రత్యేకంగా స్కూల్ విద్యార్థులు పరీక్షల సమయంలో ఆలస్యంగా చేరుకోవడం జరుగుతోందన్నారు.
అందువల్ల దయచేసి మా పోచారం ప్రధాన రహదారిని విస్తరించవలసిందిగా లేదా అవసరం లేని డివైడర్ను తొలగించవలసిందిగా మా ప్రజల తరపున తమరికి మనవి చేస్తున్నామని డిప్యూటీ కమిషనర్‌కు అందజేసిన వినతిపత్రంలో నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సామల బుచ్చిరెడ్డి, బద్దం జగన్ మోహన్ రెడ్డి, ఆకిటి బాల్ రెడ్డి, బద్దం నర్సింహారెడ్డి, తిరుమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






