10 May, 2026 | 1:06 AM

అడవి బిడ్డల కల్పతరువు ఇప్పపువ్వు

10-05-2026 12:09 AM

ఆదిలాబాద్ జిల్లా అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేవి అడవులు, ఆ అడవులతో మమేకమై జీవనం సాగిస్తున్న ఆదివాసీ గిరిజనులు. అలాంటి అడవుల్లో ప్రకృతి సిద్ధంగా లభించే ఉత్పత్తులతో ఉపాధి పొందుతున్నారు ఆదివాసీలు. జిల్లాలోని ఆదివాసి గిరిజనులకు కేవలం ఎండాకాలంలో లభించే ఇప్పపువ్వు ఉపాధి కల్పిస్తోంది. దట్టమైన అడవుల్లో మండుటెండలను సైతం లెక్క చేయకుండా చెట్టు చెట్టుకు తిరిగి సేకరించిన ఇప్పపువ్వును అమ్మి జీవనం సాగిస్తారు. 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు ఇప్ప చెట్టును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా ఇప్పపువ్వు ఆదివాసి గిరిజనులకు కల్పతరువు అని చెప్పవచ్చు. కేవలం వేసవి కాలంలో మాత్రమే లభించే ఈ ఇప్ప పువ్వులను అడవుల నుంచి సేకరించి, ఆరబెట్టి నిల్వ చేసుకొని సంవత్సరం పొడవునా తమ అవసరాలకు ఉపయోగించుకుంటారు. పువ్వు సేకరణ కోసం తెల్లవారుజామునే అడవి బాట పడుతారు.

చెట్టు చెట్టుకు తిరిగి ఇప్పపువ్వును సేకరించి, వాటిని ఇంటి ముందు ఆరబెడుతారు. ఇప్పపువ్వును గిరిజనులు చెట్టెక్కి నేరుగా తెంపరు. నేలపైన రాలిన పువ్వులను మాత్రమే ఏరుకొని గంపల్లో నింపుకొని వస్తారు. ఇప్పప్పువ్వు ఏరడం ప్రారంభించక ముందు చెట్టుకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. అనంతరం చెట్టు కింద శుభ్రం చేసి ఉంచుతారు. గాలికి ఇప్పుపువ్వులు చెట్టు నుండి కిందికి రాలిపడుతుంది.

అలా రాలి కింద పడిన పువ్వును మాత్రమే సేకరించి ఇంటికి తీసుకువస్తారు. ఇంటు ముందు, లేదంటే డాబాలపైన ఆరబెట్టిన తర్వాత నిల్వ చేసి ఉంచుతారు. తమ అవసరాలకు సరిపడా ఇప్పపువ్వును తమ వద్దనే నిల్వ ఉంచుకుని, మిగతావాటిని జిసిసి, లేదా ఇప్ప లడ్డూల తయారీ దారులకు విక్రయిస్తారు. 

ఇప్పపువ్వుతో వంటకాలు

ఇప్ప పువ్వు అనగానే ఇప్ప సారా తయారీకి ఉపయోగిస్తారని మాత్రమే అందరికి తెలుసు. కానీ ఈ ఇప్పపువ్వుతో ఇక్కడి గిరిజనులు రకరకాల వంటకాలను తయారు చేస్తారు. వేరే ఏ ప్రాంతంలో లేనటువంటి వంటకాలను సంప్రదాయ పద్ధతుల్లో తయారు చేస్తారు. ఈ ఇప్ప పువ్వుతో ప్రధానంగా లడ్డూలు, గారెలు తయారు చేస్తారు. ఇంకా నూనెలో వేయించి తీపి, కారం ఇప్పపువ్వును కూడా తినడానికి సిద్ధం చేస్తారు.

ఉమ్మడి జిల్లాలో గిరిజన మహిళలు ఇప్పలడ్డూల తయారీని కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకొని ఉపాధిని పొందుతున్నారు. అయితే ఈ ఇప్పపువ్వు సేకరణ కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లిన గిరిజనులు ఎలుగుబంటి లాంటి వన్యప్రాణుల దాడికి గురైన ఘటనలు లేకపోలేదు. 

 బీర్కూర్ వార్ వెంకటేష్ 

(ఆదిలాబాద్, విజయక్రాంతి)