16 July, 2026 | 11:03 PM

ఇకపై అభిమానుల కోసం ప్రశాంతంగా యుద్ధం చేస్తా: అఖిల్ అక్కినేని

16-07-2026 11:03 PM

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పీ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న విడుదలై, ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో నిర్మాతలు బుధవారం గుంటూరులో విజయోత్సవం నిర్వహించారు. ఈ వేడుకకు ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. “మా నాన్న ఇచ్చిన హగ్‌లోనే ఈ పదేళ్ల శ్రమ, ప్రేమ కనిపిస్తుంది. నా సర్వస్వం అయిన నాన్నకి ఎప్పుడూ రుణపడి ఉంటా. ‘లెనిన్’ను మా నాన్న తన భుజానికి ఎత్తుకుని రెండేళ్లు కష్టపడ్డారు. ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో.. అభిమానులు, ప్రేక్షక దేవుళ్లు ఇంత ప్రేమను చూపిస్తున్నారు. ఇప్పుడు నేనేమీ కాలర్ ఎగిరేయడం లేదు.. గంతులు వేయడం లేదు. ఇకపై నేను ప్రశాంతంగా ఉంటా. సైలెంట్‌గా యుద్ధం చేస్తా. ఇక్కడి నుంచి మన (అభిమానులు) ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇకపై నేను ప్రశాంతంగా మీ (అభిమానులు) కోసం యుద్ధం చేస్తా” అన్నారు.

కథానాయకి భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. “లెనిన్’తో మనం హిట్టు కొట్టేశాం. మీ (అభిమానులు) ప్రేమే మాకు అవార్డులతో సమానం. అందరూ భారతిని మనస్పూర్తిగా ప్రేమించారు. అభిమానులు చూపించే ప్రేమ కోసం నేను ఇంకా కష్టపడతా” అని చెప్పింది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు మాట్లాడుతూ.. “లెనిన్’ రిలీజ్ అయినప్పటి నుంచీ మా అయ్యగారి కళ్లలో ఆనందం కనిపిస్తోంది. నాకు ఇంత కంటే ఏం కావాలి” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత నాగవంశీ, కల్చరల్ చైర్‌పర్సన్ తేజస్వీ, నటీనటులు ప్రమోద్, శివాజీ, బ్రహ్మాజీ, ఈశ్వరీరావు కూడా మాట్లాడారు.