నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి
భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 28, (విజయక్రాంతి): జిల్లాలో నిర్వహించనున్న నీట్ (యూజీ)-2026 ప్రవేశ పరీక్షను ఎలాంటి లోపాలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కచ్చితంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మే 3వ తేదీ (ఆదివారం) మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించనున్న నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో మొత్తం 1078 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానుండగా, ఇందుకోసం మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సింగరేణి ఉమెన్స్ కళాశాల, శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాల, నవభారత్ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఎదురుగా గల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డు పైన తప్పనిసరిగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించుకోవాలని, అదనంగా మరో ఫోటోతో పాటు తాజా ఫోటో ఉన్న గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలన్నారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ, పాల్వంచ సీఐ సతీష్, జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ, కలెక్టరేట్ సూపర్డెంట్ వెంకటేశ్వర్లు, నీట్ పరీక్ష ఇంచార్జ్ ప్రసాద్, పరీక్షా కేంద్రాల సూపర్డెంట్లు, తాసిల్దారులు, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, విద్యుత్ శాఖ అధికారులు,సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






