బహుజనుల కలం
కుల నిర్మూలన కోసం సుదీర్ఘ కాలంగా పోరాటం జరుగుతూనే ఉంది. అయినా వెనుకబడిన కులాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ (Political) వెనుకబాటు నుంచి ఉపశమనం పొందలేక పోతున్నాయి. అగ్రకులాల ఆధిపత్యంలో వివక్ష ఎదుర్కొంటూ, కుల వృత్తులు కాలగమనంలో కలిసిపోతున్న కారణంగా చాలామంది బహుజనులు ఉపాధి కోసం దినసరి కూలీలుగా మారుతు న్నారు.
ఈ నేపథ్యంలోనే మనుషుల మధ్య కుల గోడలు కూలాలంటే కలాలు కదలాల్సిందే అంటూ బహుజనుల హక్కుల కోసం ‘వెంటాడే కలాలు వెనుకబడిన కులాలు’ గర్జించింది. బీసీల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వచ్చిన ఈ పుస్తకంలో చాలా మంది కవులు తమ కలాలకు పదునుపెట్టి బీసీ గళం వినిపించారు.
గంగమ్మ ఒడిలో మత్స్యకారులు జీవనోపాధి కోసం చేసే పోరాటంలో ఆటుపోట్లు, సముద్రం కన్నెర్రజేస్తే జరిగే ప్రమాదాలు, ఎగసిపడే అలలపై జాలరుల సాహసాలు, కుల వృత్తులపై పడుతున్న ప్రభావం, కరువు కారణంగా వ్యవసాయ భూముల్లో తంగేడ్లు మొలవడం వంటి బీసీ సమాజం సాదకబాధకాలు ఈ పుస్తకంలో మనకు కనిపిస్తాయి. దాదాపు రెండు దశాబ్దాల కిందటి తెలంగాణ జీవన బతుకులకు ఇది అద్దం పడుతుంది.
తెలంగాణ పల్లె బతుకులకు కూరాడులో ‘పుల్సిన కలివాసనే’ నిదర్శనం. ఆరుకాలంలో ‘నాగలెంట అచ్చం గంగమ్మలా తీరొక్క పువ్వులను సిగలో ముడిసి సింగుదుడుడ్డిన నీ కొప్పులో’ అని, ‘శిగం వూగే దేవతలా’ ఉందంటూ, ‘పైరగాలికి సంద కంకులు వెన్ను వాల్చి కూర్పు వరిచేను’ అంటూ అంబటి వెంకన్న ఎనుకటి రోజులను గుర్తుచేశారు. ‘దొర్సాని ఓ దొర్సానీ’ కవితలో ‘నీ కట్టం గలుగొద్దని’, ‘గార్వంగా జూసుకున్న’ వంటి పదబంధాలతో బడుగు కులాలపై జరుగుతున్న దాడిని, స్త్రీల వెనుకబాటుతనాన్ని తన కలంతో ఎండగట్టారు అనిశెట్టి రజిత.
పూర్వం దేవాదాసి వ్యవస్థ అంటే స్త్రీలలో ఎక్కడో తెలియని భయం ఉండేది. ఆడవాళ్ల కష్టనష్టాలను లోతుగా విశ్లేషణ చేయడమే కాక అమ్మ ప్రేమ, త్యాగాలను తెలిపారు ఏ దుర్గా ప్రసాద్. ‘కుపటి’ అనే శీర్షికతోనే ‘మా బడుగు వర్గాల పర్యాయపదం’ అంటూ బాణాల శ్రీనివాసరావు కుల వృత్తుల సప్పుడుతో పల్లె నిద్రలేచెను అన్నారు. అమ్మ నేర్పిన నడవడిక విజయతీరాలకు చేరుస్తుందని, చివరగా ‘పగిలిన మా గుండెల్లో ధైర్యంగా మేమే అతికించుకుంటాం’ అంటారాయన. బతుకు మార్గంలో పాదం ముఖ్యమైందంటూ, మట్టిపై మనిషికి మమకారం ఉండాలంటూ, ‘నేను గొర్రెల్ని కాస్తుంటాను’ శీర్షికతో బెల్లి యాదయ్య రాసిన కవిత చదువుతున్నంత సేపు గొర్ల మధ్యలో తిరుగుతునట్లు అనిపించింది.
పల్లె యాసలో మంగలి ప్రత్యేకతను తెలుపుతూ అచ్చమైన పల్లె సామెతలతో కులాంతర వివాహాల గురించి జీ విజయలక్ష్మి అద్భుతంగా చెప్పా రు. లోతైన భావంతో జుగాష్ విలి కవి స్త్రీ అంటేనే నిత్యం యంత్రంలా శ్రమిస్తుందంటూ వారి సేవలను అభినందించారు.
ఆనాటి సామాజిక రుగ్మతలను చెరిపివేయాలంటూ ‘అందంగా చెక్కే చెక్కలాగా ఎన్నెన్నిసార్లు నన్ను నేను చెక్కుకున్నానో’ అంటారు. ‘నా కొలిమి నిప్పుల రజన్లులలో బంగారు పూతల తీగల పదిరి..’ అంటూ వారి వృతితో పాటు పెద్దలను గుర్తుచేసుకున్నారు జూలూరి గౌరీశంకర్. కవి ఒక సందర్భానుసారమే పుడుతాడని భావిస్తూ, బాధ కలిగించే సన్నివేశాన్ని రచయిత చూసినప్పుడు కళ్లవెంట నీరు వస్తే దాంట్లో లీనమై రాయడమే కాదు, అణగారిన వర్గాల కోసం పోరాడుతాడనడానికి జూలూరి సాహిత్యమే నిదర్శనం.
మంచి వాడు మరణిస్తే లోకం విలపిస్తుందని, కుల అహంకారం ఎందుకని అడిగారు జూపల్లి ప్రేమ్ చంద్. పుట్టుకతోనే చదువుకు దూరమయ్యాం, నేడు కుల వృత్తులే దూరమైనవి అంటూ కో. ప్ర అగ్రకులాల సరసన మనం ఎదగలేమంటారు. కుల మరకలతో వెనుకబాటుతనం పోవాలంటూ ఎద్దుకు ఎద్దు తోడు అన్నట్లు వ్యవసాయానికి ఆసరై అన్నం పెడుతున్నాడు రైతన్న, మా తాత పొద్దుతో పోటీ పడి పని చేస్తారంటూ, జాలర్ల సవాళ్లు, మృగశిరలో చాపలు వేదనచెందుతాయని ఎం వెంకట్ అభిప్రాయపడ్డారు.
జ్యూయలరీ షాపులతో బంగారు, వెండి ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులు ఉపాధి కోల్పోయారంటూ మందిరపు హైమవతి ఆవేదనపడుతూ, కుల వివక్ష పోవాలంటారు. పదేళ్ల క్రితం ప్రతి మధ్యతరగతి కుటుంబంలో బొంత ఉండేదని, ‘బొంత మన శ్రామికజన సంస్కృతికి ప్రతీక’ అంటూ డాక్టర్ ఎన్ గోపి అమ్మ చేసిన రొట్టెను ఏ నాటికీ మరువమని మననం చేశారు. వలసవాద ఆధిపత్యంలో బాల్యంలో చదువుకు దూరమైన పిల్లలు పడే వేదన గురించి చెప్తూ, నాళే శ్వరం శంకరం ‘బతుకు బావిలో చెంచులు నీళ్లకై ప్రయాణం’ అంటూ ఆనాటి బీడీ కార్మికుల శ్రమ, సామాజిక కట్టుబాట్లపై విశ్లేషించారు.
‘నా బాల్యానికి కులం అంటుకుంది’ అని తెలుపుతూ ‘ఒక బీసీగా రాలేందుకు, ఒక ఫూలేగా పూసేందుకు కావాల్సినంత ఉంది నా దగ్గర అంటారు డాక్టర్ ననుమాస స్వామి. పండుగల వేళ సామాన్యులు పడే ఆర్థిక ఇబ్బందిని సూచిస్తూ, డాక్టర్ పులిపాటి గురుస్వామి గ్రామీణ ప్రాంతాల్లో ఎర్రమన్ను పేడ కలిపి అలుకు పీడసతో అలుకుతారని గుర్తుచేస్తూ మనిషి కష్టాలను చెప్పుకొచ్చారు.
‘తాతకో నులిపోగు’లో ప్రసాదమూర్తి పద్మశాలీల కళా నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ నేతన్నల సాదక బాధకాలను తెలుపుతూనే ఫూలే త్యాగాన్ని కొనియాడారు. సమాజ పోకడను ప్రశ్నిస్తూ ప్రసేన్ కన్నీటినది అంటూ ప్రారంభించి, మాతృభాషపై మమకారం చూపెడుతూ మన యాసను గౌరవించుకున్నారు. ‘రెజ్యూమ్’ కవితలో సీతారాం లోతైన విశ్లేషణ చేశారు. కుల నిర్మూలన కోసం పోరాడాలన్నారు డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ.
కులవృతుల వారు ప్రపంచీకరణ, సాంకేతికతతో ఉపాధి కోల్పోతున్నారని సిద్ధార్థ బొమ్మగాని చెప్పుకొచ్చారు. బీసీ చైతన్యం కోసం రచనలు, పాటలు, నాటకాలతో అడుగులేద్దామంటూ స్త్రీల వెనుకబాటుతనం, లాభాపేక్ష లేని వ్యవసాయంలో బీసీలు ముందున్నారని తెలుపుతూ కర్మాగారాలలోని కార్మికుల దుర్భరమైన జీవనాన్ని తెలుపుతూ, ‘నా వెనుకబాటు కులాలకు సమాన సంక్షేమ ఫలాలు అందటం లేదు’ అంటారు వరదయ్య. ఈ సంపుటిలో ప్రతి కవిత వస్తువు పల్లె జీవనమే.
తెలంగాణ భాష యాసలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రముఖ రచయితలు తమ కలాలకు పదును పెట్టి ఆధిపత్య వర్గంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సంకలనం వచ్చి పాతికేళ్లు అయినా పాఠకుల ఆదరణ మాత్రం తగ్గడం లేదు. సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు సిద్ధమవుతున్న వేళ మరోమారు దీనిపై అధ్యయనం చేయాల్సిన సందర్భం వచ్చింది. ఈ పుస్తకం వెనుకబడిన కులాలకు దారి దీపం అవుతుందని ఆశిద్దాం.