16 April, 2026 | 2:35 AM

నారీ శక్తి ఘనత కేంద్రానిదే!

16-04-2026 01:02 AM

ఈ బిల్లును అడ్డుకోవడానికి కాంగ్రెస్ కుట్ర

డీలిమిటేషన్‌పై రేవంత్‌రెడ్డిది తప్పుడు ప్రచారం

దేశాన్ని విభజించే రాజకీయాలకు దారితీసే చర్య

తెలంగాణ, దక్షిణాది ప్రజలు ఈ అబద్ధాలను తిప్పికొట్టాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు

  1. హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, అన్ని పార్టీలను ఒప్పించి పార్లమెంటులో ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ బిల్లును ఆమోదించిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లు అమలుకు అడ్డంకులు సృష్టించేలా కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.

ఈ బిల్లు అమలు కాకుండా చేయాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, ఇండీ అలయెన్స్ పార్టీలు కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళల సాధి కారతకు మద్దతుగా, అలాగే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లుకు అనుకూలంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా, యు వ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం స్కూటీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు హాజరై మాట్లాడారు. 2029 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు దిశగా ముం దుకు సాగుతున్న నేపథ్యంలో, ఈ నెల 16 నుంచి 18 వరకు జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ పై చర్చ జరగబోతోందని, ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మహిళలు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నారని చెప్పారు.

అదే క్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా, యువమోర్చా ఆధ్వర్యంలో ఈ స్కూటీ ర్యాలీ నిర్వహించి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించామన్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల అంశం గత 30 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉందని, యూ పీఏ ప్రభుత్వ కాలంలో కాంగ్రెస్, మిత్రపక్షాల ఒత్తిడితో ఈ బిల్లును ముందుకు తీసుకురాలేదని విమర్శించారు.

డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని, రేవంత్‌రెడ్డి చేస్తున్నది పూర్తిగా తప్పుడు ప్రచారమని, దేశాన్ని విభజించే రాజకీయాలకు దారితీసే చర్య అని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి మతం, కులం, ప్రాంతాల పేరుతో విభజన రాజకీయాలు చేస్తూ, దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన రాసిన లేఖే కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉందని స్పష్టం చేస్తోందని ఆరోపించారు. 

అబద్ధాల ప్రచారాన్ని తిప్పికొట్టాలి

దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగదని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టంగా చెప్పారని, కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మకూడదని, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, దక్షిణాది ప్రజలు ఈ అబద్ధాల ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 

రేవంత్‌రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని విభజించేలా మాట్లాడడం చాలా బాధాకరమని విమర్శించారు. ప్రధాని మోదీ ప్రభుత్వానికి నార్త్-, సౌత్ అనే తేడా లేదని, దేశంలోని ప్రతి ప్రాంతాన్ని సమానంగా చూస్తోందన్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలవుతున్న ఈ చారిత్రాత్మక సందర్భంలో, తెలంగాణలోని మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.