14 August, 2026 | 6:29 PM

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

18-06-2024 03:53 AM
  • ఇప్పటివరకు జాబ్  క్యాలెండర్ ఎందుకు ప్రకటించలేదు..?

25 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి

సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ 

హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు, నిరుద్యోగులు బీఆర్‌ఎస్ కార్యాలయానికి వచ్చి, సమస్యలు పరిష్కరించమని కోరుతున్నారన్నారు. సమస్యలు పరిష్కరించాలని అభ్యర్థులు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ దగ్గరికి వెళితే, ఆయన అంతా ప్రభుత్వం చేతిలో ఉందని సమాధానమిస్తున్నారని అభ్యర్థులు చెప్తున్నారన్నారు.

నిరుద్యోగుల సమస్యలపై వారు ప్రొఫెసర్ కోదండరాంను ప్రశ్నించినా లేకపోయిందన్నారు. రాష్ట్రప్రభుత్వం గ్రూప్ 1:50 కాకుండా 1: 100 నిష్పత్తిలో మెయిన్స్‌కు అవకాశం ఇవ్వాలన్నారు. గ్రూప్  గ్రూప్ 3కు 3వేల ఉద్యోగాలు కలుపుతామని చెప్పిన మాటలను నిలబెట్టుకోవా లన్నారు. ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని, జాబ్ క్యాలండర్ ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చాలన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జాబ్ క్యాలండర్ విడుదల చేయలేదని ప్రశ్నించారు. మొత్తం 25 వేల పోస్టులకు కాకుండా, కేవలం 11 వేల పోస్టులతో డీఎస్సీ ప్రకటించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

మొత్తం పోస్టులకూ డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పింఛన్లప పెంపు అంశాన్ని అసలు సీఎం రేవంత్ ప్రస్తావించకపోవడం విచారకరమన్నారు. పాత పద్ధతిలో అమలయ్యే పింఛను కూడా మే నెలకు పింఛనుదారులకు అందలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రవ్యాప్తంగా 44 లక్షల పింఛన్లు ఉన్నాయని, ఏటా రూ.12 వేల కోట్లను పింఛనుదారులకు అందించామన్నారు. ప్రతి నెలా 1వ తేదీనే ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్ల వేతనాలు ఇస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోందని, కానీ అది నిజం కాదన్నారు. 18వ తేదీ వరకు వారికి వేతనాలు అందడం లేదన్నారు. దీంతో వారు ధర్నాలకు దిగుతున్నారన్నారు.

పంచాయతీ వర్కర్లకు ఐదు నెలలుగా జీతాలు లేవని, కొందరు సొంత ఖర్చులతో వాహనాల్లో డీజిల్ పోయించుకుంటున్నారన్నారు.  సీఎంఆర్‌ఎఫ్‌కు సంబంధించి మొత్తం 65 వేల చెక్కులు ప్రింట్ అయి పంపిణీకి సిద్ధంగా  ఉన్నాయని, కానీ వాటిపై కేసీఆర్ చిత్రం ఉందనే కారణంతో ఈ ప్రభుత్వం వాటిని పంపిణీ చేయడం లేదని మండిపడ్డారు. అలాగే నీట్ పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయని, బీజేపీ హయాంలో సంపద కొందరి చేతుల్లోక వెళ్లినట్లే విద్య కూడా కొందరి చేతుల్లోకి వెళ్తోందన్నారు. నీట్ అవకతవకల కారణంగా దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు.

గ్రేస్ మార్కులు, పేపర్ లీకేజీ అంశాలు వారిని కలవరపెడుతున్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 67 మంది ఆలిండియా మొదటి ర్యాంక్ సాధించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. దీనిపై ప్రభుత్వం సీబీఐతో విచారణ చేయించాలన్నారు. పేపర్ లీక్ కాకపోతే బీహార్, గుజరాత్‌లో ఎందుకు అరెస్టులు మొదలయ్యాయని ప్రభుత్వాలను నిలదీశారు. తెలుగు విద్యార్థులకు అన్యాయం జరగకుండా బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు చొరవ తీసుకోవాలన్నారు.

తప్పుడు ప్రచారం మానుకోవాలి..

కొన్ని మీడియాల్లో తాను కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరుబోతున్నట్లు, మరికొందరు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు.  తమకు నచ్చినట్లుగా ప్రచారం చేయడం సరికాదని మండిపడ్డారు. ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం మానుకోవాలని, లేకపోతే మున్ముందు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఏదైనా ఉంటే తనను సంప్రదించి, నిజాలు తెలుసుకుని ప్రచారం చేయాలని సూచించారు.