నీట్ వ్యవహారంపై నిర్లక్ష్యం ఎందుకు?
- కేంద్ర విద్యాశాఖ మంత్రి నోరు మెదపరెందుకు?
పేపర్ లీక్ కాకపోతే బీహార్‌లో అరెస్టులు ఎందుకు?
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేసే సున్నితమైన నీట్ అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదని, ఈ అంశంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు నోరు మెదపడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రశ్నించారు. సోమవారం ఆయన ‘ఎక్స్’ ద్వారా విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన క్లిప్పింగ్స్ పోస్తూ చేస్తూ పలు అంశాలను ప్రస్తావించారు.
నీట్ పేపర్ లీక్ అయిందని అనడానికి ఆధారాలు లేవని కేంద్ర విద్యాశాఖ మంత్రి అంటున్నారని, అదే నిజమైతే మరి బిహార్‌లో పేపర్ లీక్ విషయమై ఇద్దరిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారని ప్రశ్నించారు. బీహార్ పోలీసులు నీట్ పేపర్ లీక్ సంబంధ ఉన్న వారి నుంచి ఆరు పోస్ట్ డేటెడ్ చెక్కులను సేకరించారని, మరో తొమ్మిది మందిని ఎందుకు విచారణకు పిలిచారని నిలదీశారు. నీట్ అంశంపై కేంద్రం వెంటనే ఉన్నతస్థాయి కమిటీ వేసి, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. కష్టపడి పరీక్ష రాసిన విద్యార్థులు నష్టపోకుండా, వారికి న్యాయం చేయాలన్నారు. విచారణలో నేరస్తులుగా తేలినవారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.






