‘పోడు’ పరిష్కారం ఎప్పుడు?
ప్రతి ఏడాది అదే ఉద్రిక్తత
పోడు రైతుల్లో ఆందోళన
చింతల మానపల్లి మండలంలో మొదలైన రగడ
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే14 (విజయక్రాంతి): జిల్లాలో పోడు భూముల సమస్య మళ్లీ భగ్గుమంటోంది. వానాకాలం ప్రారంభానికి ముందే... పోడు రైతులు, అటవీశాఖ అధికారుల మధ్య ఉద్రిక్తతలు సాధారణమైపోతున్నాయి. దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూముల్లోకి అటవీశాఖ ప్రవేశించడం, రైతులు అడ్డుకోవడం జిల్లాలో అనేక ప్రాంతాల్లో వివాదాలకు దారితీస్తోంది. చింతలమానపల్లి మండలం దింద గ్రామంలో బుధవా రం పోడు భూములలో రైతులు వ్యవసా య పనులు చేపడుతున్నట్లు వచ్చిన సమాచారంతో ఫారెస్ట్ అధికారులు అక్కడి చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
దీంతో పోడు రైతులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టడంతో అ ధికారులకు రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో దాదాపు రెండు గంటలపాటు ఉద్రిక్తత నెలకొంది. గత ఏడాది భూములలో వ్యవసాయం చేయవద్దని ముందస్తు గానే సమాచారం ఇచ్చినప్పటికీ మళ్ళీ అటవీ శాఖకు చెందిన భూములలో వ్యవసాయ పనులు ప్రారంభించడం పట్ల అడ్డుకోవడం జరిగిందని అధికారులు చెబుతున్నారు.
తమ తాతల కాలం నుండి సాగు చేస్తున్న భూములను లాక్కో వద్దని రైతులు ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకుంటున్నారు. దీంతోపాటు జిల్లాలో ఆసిఫాబాద్, చిం తలమానేపల్లి, బెజ్జూర్, రెబ్బెన తదితర మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. గతంలో ప్రభుత్వం వేలాది ఎకరాలకు హక్కు పత్రాలు ఇచ్చి రైతుబంధు అమలు చేసినప్పటికీ, సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు.
ముఖ్యంగా గిరిజనేతరులకు పట్టాలు లేకపోవడం, అటవీ హద్దులపై స్పష్టత లేకపోవడం కొత్త వివాదాలకు కారణమవుతోంది. మరోవైపు ప్రతి రేంజ్లో పోడు భూములను స్వాధీనం చేసుకోవాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు ప్రచారం జరగడం మరింత కలకలం రేపుతోంది. దీంతో అటవీశాఖ సిబ్బంది కూడా ఒత్తిడిలో పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పోడు భూములను స్వాధీన పరుచుకొని ప్లాంటేషన్ ఏర్పాటు చేసేందుకు ఆటవిశాఖ సిద్ధమవుతుండగా ఎంతో కాలంగా వ్యవసాయం చేసుకుంటున్న తమకు అన్యాయం చేయవద్దని పోడు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వ్యవసాయమే జీవనాధారం...
పోడు వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న పోడు రైతులకు ప్రతి ఏడాది ఇబ్బందులు తప్పడం లేదు. అడవుల పరిరక్షణతో పాటు గిరిజనుల జీవన హక్కులను కూడా ప్రభుత్వం కాపాడాలని డిమాండ్ ఉత్పన్నమవుతుంది.ప్రస్తుతం జిల్లాలో పోడు సమస్య కేవలం భూమి వివాదంగా కాకుండా రాజకీయ, పరిపాలనా, సామాజిక అంశంగా మారుతోంది. శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, స్పష్టమైన విధానం లేకపోవడం వల్ల ప్రతి ఏడాది ఇదే పరిస్థితి పునరావృతమవుతోంది. శాశ్వత పరిష్కారం ఎప్పుడొస్తుందోనన్న ప్రశ్నకు మాత్రం ఇంకా సమాధానం కనిపించడం లేదు.






