రహదారులు గుంతలమయం!
- ప్రయాణం నరకప్రాయం ఏళ్ళు గడుస్తున్నా మరమ్మత్తులు శూన్యం..
- నిద్ర మత్తులో ఆర్‌అండ్‌బీ అధికారులు.. పట్టించుకోని అధికారులు, పాలకులు..
పదర, అక్టోబర్ 13 : మండలంలోని రహదారులు గుంతల మాయంగా మారడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పదర ప్రధాన రహదారితోపాటు మద్దిమడుగు వరకు ఎక్కడ పడితే అక్కడ గుంతలు పడి యమ లోకానికి ద్వారాలుగా ఉన్నాయి.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా రహదారుల మరమ్మత్తు పనులపై పట్టించుకోలేకపోవడం దురదృష్టకరం..
నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మండల పర్యటనకు వచ్చినప్పుడల్లా ఈ రహదారుల గుండానే ప్రయాణం చేస్తున్నా కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం. కోతులు పడిన ఈ రహదారిలో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు గోతుల్లో పడి తీవ్రంగా గాయపడిన సంఘటనలు అనేకం. వర్షపు నీరు నిలిచి ఉండడంతో గోతులు కనిపించక ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి.
గత ప్రభుత్వ మాజీ ఎమ్మెల్యే ఎన్నోసార్లు హామీలు ఇచ్చి ఏ రోడ్డు కూడా మరమ్మతులు చేయలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. పదర నుండి మద్దిమడుగు వరకు డబల్ రోడ్డు వేయాలని ప్రయాణికులు, గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, అధికారులు స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు.




