15 July, 2026 | 12:37 AM

ఖాజీపూర్‌లో ఇసుక క్వారీని రద్దు చేయాలి

15-07-2026 12:00 AM

కొత్తపల్లి, జూలై 14 (విజయక్రాంతి): కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామ పరిధిలో నిర్వహిస్తున్న ఇసుక క్వారీ వల్ల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ఆ క్వారీని రద్దు చేయాలని కోరుతూ మంగళవారం రోజున గ్రామ సర్పంచ్ కోమటిరెడ్డి అంజనీ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. క్వారీ వద్దే బైఠాయించి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

క్వారీ కార్యకలాపాల వల్ల వెలువడుతున్న ధూళితో గ్రామాల్లోని ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులకు గురవుతున్నారని,నిత్యం వందలాది ఇసుక లారీలు తిరగడంతో గ్రామంలోని రోడ్లు పూర్తిగా పాడయ్యాయని, దీనివల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని. అడ్డగోలుగా ఇసుకను తరలించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయం, తాగునీటికి ఇబ్బందులు కలుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రింబవళ్లు జరుగుతున్న ఇసుక తరలింపు వల్ల గ్రామస్థుల భద్రతకు ముప్పు వాటిల్లుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కోమటిరెడ్డి అంజనీ కుమార్ మాట్లాడుతూ గ్రామ ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా క్వారీని కొనసాగిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ్రామ అవసరాలకు, కనీసం ప్రభుత్వ అవసరాలకు కూడా ఇసుకను ఇవ్వకుండా క్వారీ నిర్వాహకులు అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. గ్రామంలో భూగర్భ జలాలు అడగండి పోతున్నాయని, స్థానికుల ఆరోగ్యం, జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ క్వారీని రద్దు చేయాలనీ లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని  సర్పంచ్ అంజన్ కుమార్ హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు, వృద్ధులు మరియు యువకులు పాల్గొన్నారు.