15 April, 2026 | 10:41 AM

మనిషి జీవిత రుతువులు

24-11-2025 01:37 AM

సంవత్సరం కొలతను నాలుగు రుతువులు పూరిస్తుంటాయి

మనిషి మనసులో అక్కడా నాలుగు రుతువులు ఉన్నాయి!

పరువపు కోరికల మోహవంతవసంతం- మనిషికి ఉంది

అతడు తన విస్పష్టతరుణకల్పనల భావనలతో 

సమస్త సౌందర్యాన్నీ సులభ పరిమితితోనే గ్రహిస్తూంటాడు!

మనిషి తనలోని గ్రీష్మ రుతువులో భోగవిలాసంగా ఉంటూ

గతవసంతకాలంలోని- తన నిండుయవ్వనతలపుల

మధుమకరందమయ జీర్ణితరాశిని 

నెమరువేసుకోవడానికి ఇష్టపడుతూ,

స్వర్గానికి అతిసమీపంగా వెళ్లే

ఎత్తునటువంటి, అటువంటి తీపికలలే కంటూ,

ఏ సవ్వడిలేని ప్రశాంతోపసాగరాల కడ ఉంటూంటాడు!

మనిషి ఆత్మ- శరదృతువులో ఉన్న కాలంలో

తన రెక్కలను దగ్గరగా లోపలికి ముడుచుకుని,

సోమరితనంలో చక్కనైన వాటి నెన్నింటిపైననో

దృష్టి పెట్టకుండా వట్టిగా పోనిస్తూ

దగ్గరగా తన ఇంటిగడప ప్రక్కనుండే పారుతూ

పోయే సోయగాల వాగును కూడా పట్టించుకోకుండా

దూరాన ఉన్న పొగమంచుల్లోకి మాత్రం

నిక్కినిక్కి చూస్తూ పోరాటకష్టం పడుతూంటాడు!

మనిషి తనలోని శిశిర రుతువులో

అంతవరకూ చూసేవిధంగా రూపమున్నవాడు-

మరీ పేలవంగా పాలిపోతూ ‘అపరూపుడు’ అయిపోతూ,

తన మర్త్యస్వభావదేహాన్ని విడిచిపెట్టేస్తుంటాడు!

స్వేచ్ఛా కవితానువాదం

                 

ఆంగ్ల మూలం: జాన్ కీట్స్ (ది హ్యూమన్ సీజన్స్)