24-11-2025 01:39:35 AM
జీవితంలో కుదుటపడ్డాక స్థిమితపడదామనుకున్నాను రోజు రక్తం కండ్లజూసే అవస్థ దాపురిస్తుందనుకోలేదు స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లా ఉత్థాన పతనాలాడే గ్లూకోజ్ లెవెల్స్ ఆటలో సంతోష దుఃఖాల ఊగిసలాటను కలగనలేదు
చిన్నప్పుడు పడిన కష్టమంతా ఎటు పోయిందో సాధించిన స్థిరత్వం మాత్రం కొత్త కానుకనిచ్చింది బతుకు బాటలో అలుపు తగ్గి ఓ రూపాయి కూడిన వేళ నోటికింత రుచిని శరీరానికింత సుఖాన్నిఅందిద్దామనుకున్న తరుణంలో ఒంట్లోకి ఎలా దూరిందో ఈ తీపి బాధ
వారసత్వమో తరతరాల అలవాట్ల ఆహారతత్వమో ఆధునికత తగ్గించిన శారీరక శ్రమత్వమో మారిన జీవనశైలి అంటగట్టిన ఆందోళనా మనస్తత్వమో
ఏదైతేనేం ..? మధుమేహం ఇప్పుడు అందరి బంధువైంది ఒకప్పుడు అందరి ఒంట్లో పారేది రక్తమని చెప్పుకున్నాం ఇప్పుడు మధుర రసాల ఊట అని మురిసి పోదాం
నిద్రలేచి లేవగానే నడకలు, పరుగులు తిని తాగే ప్రతిదానికి కేలరీల కొలతలు క్రమశిక్షణగా మెలిగామా కనికరాల జల్లులు గాడి కొంచెం తప్పామా గ్యాంగ్రీన్ బెదిరింపులు బీపీలు, గుండె జబ్బులు అదనపు ఆహార్యాలు లివరు, కిడ్నీ ఫెయిల్యూర్లు ఆఖరి సోపానాలు
మృత్యుశయ్యని దరి చేర్చుకుంటావో నోటిని, మనసు కట్టుకొని జీవిత కాలాన్ని పొడుగించు కుంటావో తేల్చుకొమ్మని చెప్పే మధుమేహమా! నువ్వు శాపానివా? క్రమశిక్షణ నేర్పే పాఠానివా?