27 June, 2026 | 1:15 AM

తొలకరి వర్షానికి విత్తనాలు మోడుపోతున్నాయి

27-06-2026 12:09 AM

వర్షాభావ పరిస్థితులకు తోడు.. నాసిరకం విత్తనాలతో రైతుల ఇబ్బందులు

మళ్ళీ రెండవసారి విత్తుతున్న రైతులు

ఉట్నూర్, జూన్ 26 (విజయక్రాంతి) : జిల్లాలోని ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన, గిరిజనేతర రైతులు ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో కురిసిన తొలకరి వర్షానికి పత్తి విత్తనాలు నాటుకున్నారు. వర్షాభావ పరిస్థితులతో నాటిన విత్తనాలు  మొలకెత్తకపోవడంతో అప్పులు చేసి, రెండవసారి విత్తనాలు కొని విత్తుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని గాదిగూడ, నార్నూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల పరిధిలోని  గ్రామాల్లో వర్షాకాలం ప్రారంభంలో కురిసిన తొలకరి చినుకులకు పత్తి సాగుకోసం విత్తనాలు నాటుకున్నారు.

ఎలాగో వాన కాలంలో వర్షాలు వస్తాయన్న కోటి ఆశలతో రైతులు 65 వేల ఎకరాలలో పత్తి, కంది, సోయా విత్తనాలను విత్తుకున్నారు. వేసవి ఎండలను తలపించే విధంగా జూన్ 21వ తేదీ వరకు తీవ్రమైన ఎండలకు నాటిన  విత్తనాలు భూమిలోనే మాడిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నాటిన పత్తి విత్తనాలు మొలకెత్తి ఉండవచ్చని రైతులు  పంట చేనులో తిరిగి చూస్తే పది నుంచి 20 శాతం మొలకలు వచ్చాయని మిగతా 80 శాతం మొలకెత్తలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాభావ పరిస్థితులతో పాటు నాసిరకం విత్తనాల కారణంగా రైతులు నిప్పటికీ తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నారు. మొలకెత్తిని పత్తి విత్తనాల స్థలంలో మరోసారి పత్తి విత్తనాలు కొనుగోలు చేసి భూమిలో విత్తుకున్నారు. రెండోసారి పత్తి విత్తనాలను విత్తుకోవడంతో  ఎకరానికి రూ. 5000 నుండి 6000  రూపాయల విత్తనాలతో పాటు కూలీలకు కూలీ డబ్బులు చెల్లించవలసి వస్తుందని  రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగు కోసం చేసిన అప్పుల తో పాటు విత్తనాల కొరకు మరోసారి అప్పులు చేయవలసి వచ్చిందని రైతులు వాపోతున్నారు.