ఈ ఏడు మంచి వర్షాలే!

16-04-2024 03:30:20 PM

l వానకాలంలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం

l 106% మేర పడే అవకాశం

l ఎల్‌నినో నుంచి లానినో వైపు.. వాతావరణ పరిస్థితులు

l భారత వాతావరణ విభాగం అంచనా 

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: వచ్చే వర్షాకాలంలో వర్షాలు భారీగానే కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈసారి 106 శాతం మేర వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే 5 శాతం అటుఇటుగా అంచనాలు ఉంటాయని తెలిపింది. గతేడాది ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల కారణంగా కాస్త వర్షపాతం సాధారణం కన్నా తక్కువగా నమోదైంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈసారి నెమ్మదిగా ఎల్‌నినో పరిస్థితుల నుంచి లానినో పరిస్థితులకు మార్పు జరుగుతోందని వివ రించింది.

ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి లానినో మరింత బలపడుతుందని  తెలిపింది. లానినో పరిస్థితులు కనుక బలపడితే అధిక వర్షాపాతం నమోదవుతుందని చెప్పింది. సాధారణంగా జూన్ మొదటి వారంలో వానాకాలం ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్ వరకు వర్షాలు కొనసాగుతాయి. ఈసారి మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే వర్షాపాతం దేశంలోని అన్ని ప్రాంతాల్లో, అలాగే సీజన్ మొత్తం ఒకే విధంగా ఉండబోదని పేర్కొంది.

ఎల్‌నినో అంటే..?

భూమధ్య రేఖ సమీపంలో పసిఫిక్ మహా సముద్రంలో తూర్పు జలాలు అసాధారణ రీతిలో వేడి కావడమే ఎల్‌నినో అంటారు. ఈ పరిస్థితుల్లో భారతదేశంలో తీవ్రమైన వేసవి, కరువు, బలహీనమైన వర్షాకాలం వంటి పరిస్థితులు ఉంటాయి. దీనికి పూర్తి విరుద్ధమైన వాతావరణ పరిస్థితులు లానినో సమయంలో ఏర్పడుతాయి.