14 June, 2026 | 1:47 AM

మమ్మల్ని ఆ కోణంలో ఊహించుకోవాల్సింది వాళ్లే!

14-06-2026 12:20 AM

తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న మలయాళ ముద్దుగుమ్మ పార్వతి తిరువొతు. అటు సమాజంలో, ఇటు పరిశ్రమలో జరిగే విషయాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుందీ భామ. ప్రస్తుతం ఆమె ‘నోబడీ’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా వచ్చే జూలై నెలలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, ప్రమోషన్లలో భాగంగా తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పార్వతి సినీ పరిశ్రమలోని అసలు వాస్తవాలను బయటపెడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. “ఇండస్ట్రీలో ఒక నటిగా నాకున్న స్వేచ్ఛకు, అక్కడ వాస్తవంగా జరిగే పనులకు మధ్య చాలా తేడా ఉంది. సాధారణంగా నటీనటులు కంటెంట్‌ను ఎంచుకోవడంలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారనేది ఒక అపోహ మాత్రమే.

నటీనటులుగా తమకు పరిశ్రమ నుంచి వచ్చే పాత్రలనే తాము అంగీకరించాల్సి వస్తుంది. మాకు వచ్చిన ఆ కొద్దిపాటి అవకాశాల్లోనే బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడానికి, ఆ పాత్రలను ఉత్తమంగా మలచడానికి మేము శ్రమిస్తాం. పరిశ్రమలో ఒక స్థాయికి వచ్చిన నటీ నటులకు ఎపపుడూ ఆడిషన్స్ ఇచ్చే అవకాశం ఉండదు. అందుకే దర్శకులే మమ్మల్ని ఒక కొత్త కోణంలో ఊహించుకోవాలి. మేము గతంలో చేసిన పాత్రలకు భిన్నంగా, మమ్మల్ని సరికొత్తగా చూపించే పాత్రలను దర్శకులు మాకు ఇస్తారు.

మేము వారిపైనే ఆధారపడతాం. నిజ జీవిత స్ఫూర్తితో కూడిన పాత్రలను, కల్పిత పాత్రలను సమతుల్యం చేసుకునే అదృష్టం మాకు దక్కినప్పటికీ.. పరిశ్రమలో చాలామంది నటీనటులకు, ముఖ్యంగా మహిళా నటీమణులకు ప్రజలు ఊహించిన దానికంటే చాలా తక్కువ అవకాశాలు వస్తాయి. ఆ కొద్దిపాటి పరిమిత అవకాశాల్లోనే ప్రతి పాత్రను సద్వినియోగం చేసుకుంటూ మమ్మల్ని మేము నిరూపించుకోవాల్సి వస్తోంది” అని చెప్పుకొచ్చింది.