2 April, 2026 | 3:16 AM

అప్పుల్లో ఉన్నవారికి ధైర్యాన్నిచ్చే చిత్రమిది

02-04-2026 12:00 AM

పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రామ్ చక్రి ఈ చిత్ర విశేషాలను తెలిపారు.

“కార్మేని సెల్వం’ సినిమా మధ్యతరగతి జీవితంపై ఆధారపడి ఉంటుంది. ప్రతిఒక్కరూ కథతో కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా అప్పుల సమస్యతో బాధపడుతున్నవారికి ఈ సినిమా ఒక ధైర్యాన్నిస్తుంది. మధ్యతరగతి కుటుంబాల్లో అప్పులు అనేవి కామన్‌గా ఉంటాయి. వాటి కారణంగా కుటుంబంలోని సంబంధాలు, వారు తీసుకునే నిర్ణయాలు ఎలా ప్రభావితం చేస్తాయనేది ఇందులో చూపించబోతున్నాం.

చాలా రియలిస్టిక్‌గా మూవీ ఉంటుంది. ఈ సినిమా ద్వారా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నా. కుటుంబంలోని పెద్దలు కొందరు విదేశాల్లో జీవనోపాధి కొనసాగిస్తున్నారు. కానీ వారి కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి. ఏడాదికి కనీసం ఒకట్రెండు సార్లు అయినా  వారు తిరిగి వచ్చి తమ కుటుంబాలతో కలవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకు ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది” అని చెప్పారు.