2 April, 2026 | 3:20 AM

బ్యాండ్ మేళం విజిటింగ్ కార్డ్!

02-04-2026 12:00 AM

హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా సినీ రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో వచ్చిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీశ్ జవ్వాజీ దర్శకత్వంలో కావ్య, శ్రావ్య నిర్మించిన ఈ సినిమా మార్చి 26న విడుదలైంది. థియేటర్లలో తమ సినిమాకు ప్రేక్షకాదరణ లభిస్తోందని పేర్కొంటూ మూవీటీమ్ ‘జాయ్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ థాంక్యూ మీట్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో కోన వెంకట్ మాట్లాడుతూ.. “ఇందులో నటించిన ప్రతిఒక్కరికీ ఇకపై ఆడిషన్స్ అవసరం లేదు.. ‘బ్యాండ్ మేళం’ విజిటింగ్ కార్డ్‌గా ఉంటుంది. మరికొంత షూటింగ్ చేసిన తర్వాత అక్టోబర్ 16న మరాఠీలోనూ ఈ సినిమాను విడుదల చేస్తాం. ఆడియెన్స్ పర్ఫెక్ట్ జాబ్ చేశారు.. సినిమాను హిట్ అయింది. అందుకే ప్రేక్షకులకు థాంక్స్ చెప్పాలని ఈవెంట్ పెట్టాం.

నేను నిర్మాతగా చేసిన అన్ని చిత్రాల్లోకెల్లా టాప్ 3లో ‘బ్యాండ్ మేళం’ ఉంటుంది” అన్నారు. ‘ప్రేక్షకుల వల్లే మేం ఈ స్థాయిలో ఉన్నామ’ని హీరో హర్ష్ రోషన్ తెలిపాడు. ‘ప్రతిచోటా హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయ’ని హీరోయిన్ శ్రీదేవీ చెప్పింది. ఇంకా ఈ కార్యక్రమంలో బీవీఎస్ రవి, బెక్కెం వేణు గోపాల్‌తోపాటు చిత్ర దర్శకుడు సతీశ్ జవ్వాజి, చిత్రబృందంలోని పలువురు కూడా మాట్లాడారు.