26 February, 2026 | 2:44 AM

ఈ-నామ్ 2.0 వెర్షన్ స్లో

26-02-2026 01:01 AM
  1. మోరాయింపుతో రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన వ్యవసాయ ఉత్పత్తులు
  2. ఇబ్బందులుపడ్డ రైతులు

మహబూబాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా 1,400కు పైగా వ్యవసాయ మార్కెట్లలో అమలు చేస్తున్న జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ విధానం ఈ 1.0 స్థానంలో కొత్తగా బుధవారం నుంచి ప్రవేశపెట్టిన 2.0 కొత్త వెర్షన్ ఆదిలోనే హంసపాదుగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 40కి పైగా వ్యవసాయ మార్కెట్లలో ఈ నామ్ విధానం అమలు జరుగుతుండగా, బుధవారం వ్యవసాయ ఉత్పత్తుల విక్రయించడానికి వచ్చిన రైతులకు కొత్తగా ప్రవేశపెట్టిన 2.0 వెర్షన్ మోరాయించడంతో వ్యవసాయ ఉత్పత్తులను సకాలంలో విక్రయించలేకపోయారు.

కొన్ని మార్కెట్లలో రైతులు గంటలు తరబడి గేట్ ఎంట్రీ, లాట్ ఎంట్రీ రసీదుల కోసం పడి కాపులు పడ్డారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు వ్యాపారులు ఈ టెండర్ వేయడానికి నిరీక్షించి చివరకు పలుచోట్ల పాత పద్ధతి 1.0 వెర్షన్ ద్వారా, ఇంకొన్ని చోట్ల మ్యానువల్ విధానం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించే విధంగా 2016లో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ ఈ నామ్ విధానాన్ని ప్రవేశపెట్టింది.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1400 పైగా మార్కెట్లలో, తెలంగాణలో 47 మార్కెట్లలో ఈనామ్ విధానం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ఈ విధానం వల్ల పారదర్శకంగా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, కాంటా, ఆన్లున్ విధానంలో చెల్లింపులు, మార్కెట్ చార్జీల చెల్లింపులు పూర్తిగా డిజిటల్ విధానంలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కొత్తగా 2.0 వెర్షన్ ప్రవేశపెట్టిన ఎస్‌ఎఫ్‌ఏసి సంస్థ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొత్తగా అమల్లోకి తెచ్చింది.

బుధవారం వరంగల్ జిల్లాలోని కేసముద్రం మార్కెట్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఈ నామ్ 2.0 వెర్షన్ అమలు చేయడంతో రైతులు తమ పుట్టిన తేదీ, పిన్కోడ్ నెంబర్, ఇతర వివరాలను తెచ్చుకోకపోవడం, కొందరు తెచ్చుకున్నా డేటా ఎంట్రీ ఆపరేటర్లు నమోదు చేసినా కంప్యూటర్ స్వీకరించకపోవడంతో రైతులకు గేట్ ఎంట్రీ, లాట్ ఎంట్రీ రసీదుల జారీ చేయలేకపోయారు. దీనితో మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా సర్వర్ పనిచేయడంలో మార్పు కనిపించకపోవడంతో వ్యాపారులు ఈ టెండర్ వేయలేకపోయారు. చివరకు మాన్యువల్ విధానంలో వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశారు.

ఇక వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో 2.0 వెర్షన్ పనిచేయకపోవడంతో పాత 1.0 వెర్షన్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేశారు. ఇదిలా ఉంటే ఇతర రాష్ట్రాల్లో కూడా 2.0 వెర్షన్ సక్రమంగా పనిచేయడం లేదని, తాజాగా తెలంగాణ రాష్ర్టంలో ప్రవేశపెట్టిన రోజే 2.0 వెర్షన్ మోరాయించిందని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే కొత్త వెర్షన్ రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని, ప్రారంభంలో కొన్ని అడ్డంకులు తలెత్తడం సహజమని,

రైతులు వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించడానికి వచ్చే ముందుగానే ఆధార్ కార్డు, లింకు అయిన ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతా, పుట్టిన తేదీ, గ్రామానికి సంబంధించిన పిన్కోడ్ నెంబర్ తెచ్చుకోవాలని మార్కెట్ అధికారులు సూచిస్తున్నారు. ఇలా ఒకసారి రైతుల పేర్లు మార్కెట్లో నమోదు చేస్తే వెంటనే రిజిస్ట్రీ జరుగుతుందని, తర్వాత వారి వివరాలు లేదంటే ఫోన్ నెంబర్ చెప్పిన సరిపోతుందని చెబుతున్నారు. రైతులు చాలామంది పిన్కోడ్, పుట్టిన తేదీ, ఆధార్ కార్డు లింకు లేనివారు వ్యవసాయ ఉత్పత్తులు ఎలా అమ్మాలని ప్రశ్నిస్తున్నారు.

రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదు

నిరక్షరాస్యులైన అనేకమంది రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించిన పంట ఉత్పత్తులను విక్రయించుకోవడానికి వస్తే కొత్త కొత్త నిబంధనలు పెట్టి ఇబ్బందులు పెట్టడం కాదు. వ్యవసాయ మార్కెట్లలో సులువైన పద్ధతిలో రైతులు పంటలు విక్రయించుకోవడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. డిజిటలైజేషన్ పేరుతో నిరక్షరాస్యులను మార్కెట్లలో పడిగాపులు పడే విధంగా చేయకూడదు. 

 బానోత్ హరిలాల్, రైతు, తీగలవేణి, మహబూబాబాద్,