22 August, 2026 | 4:44 PM

బీఆర్‌ఎస్, బీజేపీకి ఓటు అడిగే అర్హత లేదు

22-05-2024 02:44 AM

ఒక్క అవకాశం ఇవ్వండి మీ పిల్లల భవిష్యత్తు మారుస్తా 

కొత్తగూడెం ఆత్మీయ సమావేశంలో తీన్మార్ మల్లన్న

భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం : మే 21(విజయక్రాంతి): పట్ట భద్రుల ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని, అనునిత్యం ప్రజాగొంతుకగా సమస్యలపై పోరాడుతున్న తనకు అవకాశం ఇస్తే నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యలపై పోరాడుతానని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న హామీ ఇచ్చారు. మంగళవారం కొత్తగూడెంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. మూడేండ్ల క్రితం పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డిని గెలిపిస్తే.. ఒక్క రోజైనా పట్ట భద్రులను కలిసి సమస్యలు తెలుసుకున్నాడా అని ప్రశ్నించారు. అర్ధంతరంగా నియోజకవర్గాన్ని వదిలేసి మధ్యంతర ఎన్నికలకు కారణమైనాడని విమర్శించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి భేషరతుగా కొత్తగూడెంలోని అమరవీరుల స్థూపం వద్ద తప్పయిందని ముక్కునేలకు రాయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న మరో పార్టీ.. రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి పరిశ్రమలను  ప్రైవేటు పరం చేసిందని ఆరోపించారు. తాను ఓటమి పాలైనా ఒక్క రోజూ ఇంట్లో ఉండకుండా నిత్యం ప్రజాసమస్యలపై ఉద్యమిస్తున్నానని స్పష్టంచేశారు. అధికార పార్టీని ప్రశ్నిస్తే అక్రమ కేసులు నమోదు చేసి జైలు పాలు చేశారని గుర్తుచేశారు. తనపై పెట్టిన ఒక్క కేసు రుజువు చేసినా అమరవీరుల స్థూపం వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడతానని సవాలు విసిరారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్నను చట్టసభకు పంపేందుకు ప్రతిఒక్కరు సైనికుల్లా పనిచేయాలని కోరారు.  సమావేశంలో కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రాఘురామరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరప కనకయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌పాషా తదితరులు  పాల్గొన్నారు.

మల్లన్న గెలుపు ఖాయం : పొంగులేటి
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం టీసీవీరెడ్డి ఫంక్షన్‌హాల్లో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తీన్మార్ మల్లన్నపై బనాయించిన కేసులన్నీ బూటకపు కేసులేనని ఆరోపించారు. ఈ సారి తండ్రి, కొడుకుల కుతంత్రా లు చెల్లబోవని, బీఆర్‌ఎస్ వైఫల్యాల వల్లే వచ్చిందని గుర్తుచేశారు. ప్రశ్నించే గొంతుకకు పట్టంకట్టాలని కోరారు. గత ఎన్నికల్లో  ఓట్లేసిన పట్టభద్రులను బీఆర్‌ఎస్ రోడ్డున పడేసిందని, వారి స్వార్థ రాజకీయాల వల్లే ఈ ఉపఎన్నిక వచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్న తెలిపారు. అక్రమ కేసులకు బెదరకుండా ప్రజలపక్షాన నిలిచానని, ప్రజాసమస్యలను చట్ట సభల్లో వినిపిస్తానని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల ఇంఛార్జీ రఘునాథ్ యాదవ్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మువ్వా విజయ్‌బాబు, రాయల నాగేశ్వర్‌రావు, బాలసాని లక్ష్మీనారాయణ  తదితరులు పాల్గొన్నారు.