ప్రభుత్వాన్ని కడిగి పారేసే అభ్యర్థిని గెలిపించండి
సాగర్ ఆయకట్ట ఎండిపోతే కాంగ్రెస్ పట్టించుకోలె..
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
సూర్యాపేట, మే21 (విజయక్రాంతి): అభ్యర్థుల గుణగణాలను చూసి గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓటెయ్యాలని, ప్రజాసమస్య లపై ప్రభుత్వాన్ని కడిగిపారేసే అభ్యర్ధిని గెలిపించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. నల్లగొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ అభ్యర్ధి ఏనుగుల రాకేశ్‌రెడ్డి మద్దతుగా నల్లగొండ జిల్లా కేంద్రంతోపాటు హాలియా, దేవరకొండ, సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో మాజీ మంత్రులు జగదీష్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు 420 హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచి, ఇప్పుడు సన్న రకాలకు మాత్రమే ఇస్తామంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పదేళ్లు నిజాయితీగా పని చేశామని, కాంగ్రెస్ 5 నెలల కాలం లో అవినీతి మయం అయిందని ధ్వజమెత్తారు. గతంలో మంజూరైన ఉద్యోగాలకు ఇప్పుడు ఆర్డర్లు ఇస్తూ రేవంత్‌రెడ్డి తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగర్ ఆయకట్ట ఎండిపోతే కాంగ్రెస్ నాయకులు అటువైపు కూడా చూడలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలను ఆగం పట్టించారని ఆరోపించారు. దేశంలో తెలంగాణను నంబర్‌గా చేసిన ఘనత కేసిఆర్‌దని, చీడ పురుగు లాంటి కాంగ్రెస్‌కు పట్టభద్రలు ఓటుతో బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, గువ్వల బాలరాజు, పైళ్ల శేఖర్‌రెడ్డి, నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, బండా నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






