24 July, 2026 | 4:12 PM

ఫార్మ్ పాండ్లతో వర్షపు నీటిని నిల్వ చేసుకుని పొడి పరిస్థితులను ఎదుర్కోవాలి

24-07-2026 03:42 PM

అక్టోబర్ నాటికి తిరుమల ఆయిల్‌కెమ్ ఫ్యాక్టరీ ప్రారంభించాలి

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్,(విజయక్రాంతి): రైతులు ప్రభుత్వం అందిస్తున్న ఫార్మ్ పాండ్లను సద్వినియోగం చేసుకుని వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా పొడి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. అలాగే తిరుమల ఆయిల్‌కెమ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను వేగవంతం చేసి అక్టోబర్ నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామంలో 128 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన మెగా ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మొక్కలు నాటారు.

అనంతరం రైతు గీత్ల పవన్ కుమార్ రెడ్డి సాగు చేస్తున్న 17 ఎకరాల ఆయిల్‌పామ్ తోటను పరిశీలించి సాగు విధానాలు, మొక్కల నాణ్యత, రైతులకు అందుతున్న ప్రోత్సాహకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతులకు ఉత్తమ నాణ్యత గల ఆయిల్‌పామ్ మొక్కలనే సరఫరా చేయాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.

రైతుల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. తిరుమల ఆయిల్‌కెమ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ బురారియాతో ఫ్యాక్టరీ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి అక్టోబర్ నెలలో ఫ్యాక్టరీని ప్రారంభించాలని ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంతో పొడి వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశమున్నందున రైతులు 100 శాతం సబ్సిడీతో అందిస్తున్న ఫార్మ్ పాండ్లను ఏర్పాటు చేసుకుని వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు.

డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్, ఫార్మ్ పాండ్లు వంటి నీటి సంరక్షణ పద్ధతులను పాటించడం ద్వారా ఆయిల్‌పామ్ సాగులో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయాన్ని అందించే వాణిజ్య పంటగా ఆయిల్‌పామ్‌ను రైతులు విస్తృతంగా సాగు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు, తిరుమల ఆయిల్‌కెమ్ కంపెనీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, రైతులు, ఆయిల్‌పామ్ సాగుదారులు పాల్గొన్నారు.