15-08-2025 01:31:35 AM
అలస్కా, ఆగస్టు 14: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు అలస్కాలో భేటీ అవనున్నారు. ప్రపంచం మొత్తం అలస్కా సమ్మిట్‌లో ఏ నిర్ణయం వెలువడుతుందో అని ఆతృతగా ఎదురుచూస్తోంది. శుక్రవారం జరిగే ఈ క్లోజ్డ్ డోర్ సమావేశం ప్రతిఫలం ఎలా ఉంటుందోనని అంతా ఎదురుచూస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేలా ట్రంప్ ఎటువంటి ప్రతిపాదనలు చేస్తారో.. దానికి పుతిన్ ఏం సమాధానం చెబుతారో అనే టెన్షన్ నెలకొంది.
ఈ భేటీ తర్వాత ఒక వేళ పుతిన్ యుద్ధం ఆపకపోతే అత్యంత తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ ఇది వరకే హెచ్చరించారు. 2018లో పుతిన్-ట్రంప్ నడుమ హెల్‌సింకి సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్ దాదాపు 2 గంటలకు పైగా జరగడం గమనార్హం. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకే నేటి సమావేశం అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపేందుకు అమెరికా నిజాయతీతో ప్రయత్నాలు చేస్తోందని పుతిన్ తెలిపారు. ఈ ఇద్దరు నేతల భేటీ కోసం వైట్ హౌజ్ అన్ని ఏర్పాట్లు చేసింది.