29 March, 2026 | 11:19 PM

రేపు టీఎస్ ఈసెట్ పరీక్ష

05-05-2024 01:52 AM

గంటన్నర ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి

ఈసెట్ కన్వీనర్ ప్రొ.చంద్రశేఖర్

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): టీఎస్ ఈసెట్ ప్రవేశ పరీక్ష సోమవారం (6న) జరగనుంది. పరీక్ష నిర్వహణకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష సమయానికి గంటన్నర ముందే అంటే ఉదయం 7.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అభ్యర్థులకు అధికారులు సూచించారు. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్‌ను అధికారులకు చూపించాలని ఈసెట్ కన్వీనర్ ప్రొ.పి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుర్తింపు కార్డు కింద కాలేజీ ఐడీ కార్డు, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిని చూపించాల్సి ఉంటుందన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్‌ఫోన్, కాలిక్యులేటర్స్, స్మార్ట్ వాచ్ వంటివి అనుమతించబోమని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 99 కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఏపీలో ఏడు పరీక్ష కేంద్రాలు, తెలంగాణ జిల్లాలో 48, హైదరాబాద్ రీజియన్‌లో 44 కేంద్రాలను ఏర్పాటు చేశారు. టీఎస్ ఈసెట్ పరీక్షను మొత్తం 24,272 మంది అభ్యర్థులు రాయనున్నారు.