30 March, 2026 | 12:58 AM

ఒకే నేరాభియోలపై వేర్వేరు శిక్షలు తగదు

05-05-2024 01:53 AM

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): విద్యార్థులకు రుణాల పేరుతో బ్యాంకును మోసం చేశారనే అభియోగాల కేసులో కొందరికి వేతనంలో కోత, ఒకరిని సర్వీస్ నుంచి తొలగింపు నిర్ణయాలను హైకోర్టు తప్పుపట్టింది. ఒకే కేసులో అధికారులకు శిక్షల విధింపు పక్షపాతంతో ఉండకూడదని చెప్పింది. బ్యాంకు మేనేజర్‌పై ఒత్తిడి చేసి నకిలీ రుణ మంజూరు పత్రాలను జారీ చేశారనే అభియోగాల కేసులో ఉద్యోగం నుంచి తొలగించడాన్ని ఎస్బీహెచ్ బ్యాంకు మేనేజరు పీటీఎం గోపాలకృష్ణ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ  పిటిషన్‌ను జస్టిస్ ఎన్ రాజేశ్వరరావు ఇటీవల విచారించారు.

హైదరాబాద్‌లోని పలువురు బ్రాంచ్ మేనేజర్లు విద్యార్థులకు రుణాల పేరుతో నకిలీ విద్యారుణాలను మంజూరు చేశారనే విషయాన్ని ఎస్బీహెచ్ డీజీఎం 2016లో గుర్తించారు. ఈ కేసులో మౌలాలి బ్రాంచ్లో పనిచేస్తున్న పీటీఎం గోపాలకృష్ణను 2018లో ఉద్యోగం నుంచి తొలగించింది. ఇతర నిందితులకు వేతనంలో కోత విధించింది. ఇది వివక్షతతో కూడినదని గోపాలకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్వీసు నుంచి తొలగింపు శిక్షకాకుండా మరొక శిక్ష విధించాలంటూ పిటిషనర్ సమర్పించిన వినతిపత్రంపై నాలుగు వారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని బ్యాంకు అధికారులను హైకోర్టు ఆదేశించింది.